దళిత సర్పంచ్ కుటుంబాన్ని బెదిరించిన వ్యక్తిని వెంటనే అరెస్టు చేయాలి
మంత్రి శ్రీధర్ బాబు స్పందించాలి.. లేకుంటే ఇంటిని ముట్టడిస్తాం
కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి కల్లెపల్లి అశోక్ హెచ్చరిక
ప్రజావాణి జిల్లా ప్రతినిధి
పెద్దపల్లి నవంబర్ 14
పెద్దపల్లి: పుట్టపాక గ్రామానికి చెందిన దళిత సర్పంచ్ కన్నూరి రాజబాబు కుటుంబాన్ని కులం పేరుతో దూషించి, ప్రాణహాని బెదిరింపులకు పాల్పడిన పోరేటి తిరుపతిరెడ్డిని వెంటనే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి కల్లెపల్లి అశోక్ డిమాండ్ చేశారు.
కేవీపీఎస్, ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ, వైకేఎస్ ప్రజాసంఘాల నాయకులు బాధిత సర్పంచ్ కుటుంబాన్ని వారి నివాసంలో కలిసి ఘటన వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ ఈ నెల 8న రాజబాబు కుమారుడు అభిరామ్ మంథని నుంచి పుట్టపాకకు బైక్పై వస్తుండగా పోరేటి తిరుపతిరెడ్డి కారుతో ఢీకొట్టినట్లు తెలిపారు. అనంతరం జరిగిన ఫోన్ సంభాషణలో రాజబాబు కుటుంబ సభ్యులను కులం పేరుతో దూషించడంతో పాటు చంపుతానని బెదిరించినట్లు ఆరోపించారు.
ఈ ఘటనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయడంతో సరిపెట్టకుండా నిందితుడిని వెంటనే అరెస్టు చేసి రిమాండ్కు తరలించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో దళితులపై దాడులు, కులవివక్ష ఘటనలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆర్ల సందీప్ మాట్లాడుతూ బాధితులకు న్యాయం జరిగేలా పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు. దళితులపై దాడులు, బెదిరింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఈ ఘటనపై వెంటనే స్పందించి నిందితుడి అరెస్టుకు చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ప్రజాసంఘాలు, దళిత సంఘాలను కలుపుకొని మంత్రి నివాసాన్ని ముట్టడిస్తామని నాయకులు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో దళిత సర్పంచ్ కన్నూరి రాజబాబు, ఆయన కుమారుడు అభిరామ్, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు మోదుంపల్లి శ్రావణ్, డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు గొరెంకుల సురేష్, మంథని లింగన్న, చిప్పకుర్తి అరవింద్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.


