*అసమానతల అంతమే లక్ష్యంగా ఉద్యమించాలి*
*శ్రామిక వర్గ రాజ్య స్థాపనతోనే పేదలకు విముక్తి*
*ప్రజా సమస్యలపై కలంతో.. క్షేత్రస్థాయిలో జగన్ పోరాటం*
*సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ*
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా. నవంబర్ 14 (ప్రజావాణి): మంచాల సమాజంలో ఆర్థిక, సామాజిక అసమానతలను రూపుమాపి సమానత్వం సాధించడమే లక్ష్యంగా ప్రజలు సంఘటితమై ఉద్యమించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జాన్ వెస్లీ పిలుపునిచ్చారు. శ్రామిక వర్గ రాజ్య స్థాపనతోనే పేదలకు నిజమైన విముక్తి లభిస్తుందని పేర్కొన్నారు.
మంచాల మండలం నోముల గ్రామంలో సీపీఎం మండల కమిటీ సభ్యుడు, నవతెలంగాణ విలేకరి పల్లాటి జగన్ సంతాప సభను శుక్రవారం నిర్వహించారు. సీపీఎం నాయకుడు ఎర్ర లింగం అధ్యక్షతన జరిగిన ఈ సభలో తొలుత జగన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జాన్ వెస్లీ మాట్లాడుతూ.. దేశ సంపద కొద్దిమంది బడా పెట్టుబడిదారుల చేతుల్లోనే కేంద్రీకృతమవుతోందని అన్నారు. దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న కార్మికులు, కర్షకులకు తగిన ప్రతిఫలం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు కనీస వేతనాలు, భూ పంపిణీ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని విమర్శించారు. నాణ్యమైన విద్య, వైద్యం సామాన్యులకు అందుబాటులో లేకపోవడంతో పేద కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల నిరుద్యోగం, ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయని అన్నారు.
రాష్ట్రంలో సుమారు 30 లక్షల కుటుంబాలకు ఇళ్లు, ఇంటి స్థలాలు లేవని, నివాస స్థలాల కోసం ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకుంటున్న పేదలపై పోలీసుల ద్వారా అణచివేతకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. పేదలు, కార్మికులు, కర్షకులు తమ హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో నాలుగు వేల మంది ప్రాణత్యాగాల ఫలితంగా పది లక్షల ఎకరాల భూమి పేదలకు పంపిణీ జరిగిందని గుర్తుచేశారు.
ప్రజల పక్షాన నిలిచిన జగన్
అట్టడుగు వర్గాల నుంచి ఎదిగిన పల్లాటి జగన్.. పాషా, నరహరి వంటి ఉద్యమకారుల ఆశయ స్ఫూర్తితో ప్రజా పోరాటాల్లో చురుకుగా పాల్గొన్నారని జాన్ వెస్లీ కొనియాడారు. విద్యార్థి దశ నుంచే ఉద్యమ ప్రస్థానాన్ని ప్రారంభించి, చివరి శ్వాస వరకు ఎర్రజెండా ఆశయాల కోసం పనిచేశారని అన్నారు. జర్నలిస్టుగా ప్రజా సమస్యలను తన కలం ద్వారా వెలుగులోకి తెచ్చారని, ముఖ్యంగా రైతులు, గ్రామీణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం కథనాలు రాశారని పేర్కొన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కంటే ప్రజా ప్రయోజనాలకే ప్రాధాన్యతనిచ్చిన జగన్ జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని, ఆయన ఆశయాలను కొనసాగించడమే నిజమైన నివాళి అని అన్నారు.
సీపీఎం జిల్లా కార్యదర్శి బోడ సామెల్ మాట్లాడుతూ.. పార్టీకి, ప్రజా ఉద్యమాలకు జగన్ అందించిన సేవలు మరువలేనివని అన్నారు. ఆయన కుటుంబానికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ పగడాల యాదయ్య, సీపీఎం మండల కార్యదర్శి రావుల జంగయ్య, జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు కందుకూరి జగన్, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ దండేటికార్ రవి, టీడీపీ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి చక్రపాణి, సీఐటీయూ రాష్ట్ర నాయకులు ఎర్ర అశోక్, మాజీ సర్పంచ్ బాలరాజు, సీపీఎం జిల్లా, మండల కమిటీ నాయకులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రజాసంఘాల ప్రతినిధులు, జర్నలిస్టులు, జగన్ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పాల్గొని నివాళులర్పించారు.


