📄 ePaper
Epaper 2
Friday, November 13, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణముధోల్‌లో విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్ పోటీలు

ముధోల్‌లో విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్ పోటీలు

📰 Generate e-Paper Clip

*ముధోల్‌లో విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్ పోటీలు!*

*ఎన్నికల ప్రక్రియపై అవగాహన పెంపొందించడమే లక్ష్యం.. ఏడు మండలాల విద్యార్థుల ఉత్సాహభరిత పాల్గొనడం.. తదుపరి స్థాయి పోటీలకు 20 మంది విద్యార్థుల ఎంపిక*

నిర్మల్ జిల్లా ప్రజావాణి బ్యూరో ముధోల్, నవంబర్ 13:–
ఎన్నికల ప్రక్రియపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించడంతో పాటు ప్రజాస్వామ్య విలువలు, ఓటు హక్కు ప్రాధాన్యతను తెలియజేసే లక్ష్యంతో ఎలక్టోరల్ లిటరసీ క్లబ్ (ELC) ఆధ్వర్యంలో ముధోల్ అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి వ్యాసరచన, క్విజ్ పోటీలను శుక్రవారం విజయవంతంగా నిర్వహించారు.
భైంసా సబ్ కలెక్టర్, ముధోల్ అసెంబ్లీ నియోజకవర్గ ఓటరు నమోదు అధికారి (ERO) అజ్మీర సంకేత్ కుమార్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ పోటీల్లో నియోజకవర్గ పరిధిలోని ఏడు మండలాలకు చెందిన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థుల్లోని సృజనాత్మకత, విషయ పరిజ్ఞానం, ప్రతిభను వెలికితీసే విధంగా పోటీలను నిర్వహించారు. భైంసా మండల విద్యాశాఖాధికారి సుభాష్ డివిజన్ ఎలక్ట్రోల్ డిటి ముత్యం , భాషా నిపుణుల సమక్షంలో పోటీలు నిర్వహించగా, విద్యార్థులు ప్రదర్శించిన ప్రతిభ ఆధారంగా మూల్యాంకనం చేపట్టారు. అనంతరం వ్యాసరచన విభాగం నుంచి 10 మంది, క్విజ్ పోటీల విభాగం నుంచి మరో 10 మంది విద్యార్థులను కలిపి మొత్తం 20 మందిని తదుపరి స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. విద్యార్థి దశ నుంచే ఎన్నికల విధానం, ఓటు హక్కు వినియోగం, ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రాధాన్యతపై అవగాహన కల్పించడం ఎంతో అవసరమని ఈ కార్యక్రమం చాటిచెప్పింది. భవిష్యత్తులో బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదిగేందుకు ఇలాంటి పోటీలు దోహదపడతాయని నిర్వాహకులు పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.