నంగునూరు, నవంబర్ 11:
గ్రామ ప్రజలందరి సహకారంతో సిద్ధన్నపేట గ్రామ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు హామీ ఇచ్చారు. గ్రామ అభివృద్ధికి సంబంధించిన పలు సమస్యలు, చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను తన దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తానని సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా సిద్దన్నపేట గ్రామానికి చెందిన భారత రాష్ట్ర సమితి నాయకులు బుధవారం హైదరాబాద్‌లోని కోకాపేటలోని హరీశ్‌రావు నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న పలు సమస్యలు, ప్రజల అవసరాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి ఆయనతో చర్చించారు. గ్రామ అభివృద్ధికి అవసరమైన పనులను వివరించారు. వాటికి సహకారం అందించాలని నాయకులు హరీశ్‌రావును కోరారు. గ్రామ ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సహకరించాలని కోరారు. దీనిపై హరీశ్‌రావు సానుకూలంగా స్పందిస్తూ గ్రామ ప్రజలు, నాయకులు సమష్టిగా ముందుకు వచ్చి అభివృద్ధి కోసం కృషి చేయాలని సూచించారు. ప్రజలందరి సహకారంతో సిద్ధన్నపేట గ్రామ ప్రగతికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని భరోసా ఇచ్చారు. గ్రామ సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉంటానని తెలిపారు.ఈ కార్యక్రమంలో బండి ప్రశాంత్, బీఆర్ఎస్ గ్రామ శాఖ మాజీ అధ్యక్షులు డాకూరి కోటీశ్వర్‌రెడ్డి, యువజన విభాగం అధ్యక్షులు గజ్జెల సతీశ్ రెడ్డి, వార్డు సభ్యులు డాకూరి రాజిరెడ్డి, బీఆర్ఎస్వీ అధ్యక్షులు ఎం.డి.ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు.


