📄 ePaper
Epaper 2
Saturday, November 14, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSiddipetవార్డు మెంబర్ల కుటుంబాలకే ఇందిరమ్మ ఇళ్లా? అర్హులైన నిరుపేదలకు అన్యాయం...

వార్డు మెంబర్ల కుటుంబాలకే ఇందిరమ్మ ఇళ్లా? అర్హులైన నిరుపేదలకు అన్యాయం జరిగిందంటూ ఖాతా గ్రామస్తుల ఆవేదన

📰 Generate e-Paper Clip

నంగునూరు, నవంబర్ 11:సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం ఖాతా గ్రామంలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులపై వివాదం నెలకొంది. అర్హులైన నిరుపేద కుటుంబాలను పక్కనపెట్టి, గ్రామానికి చెందిన కొందరు వార్డు సభ్యులు, వారి కుటుంబ సభ్యులు, అన్నదమ్ములకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించారంటూ గ్రామస్థుడు కొలిపాక శ్రీనివాస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు ఆరోపణలు చేశారు.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం నిరుపేదలకు ఆశ్రయం కల్పించాలనే లక్ష్యంతో చేపట్టినప్పటికీ, ఖాతా గ్రామంలో ఆ లక్ష్యానికి విరుద్ధంగా కేటాయింపులు జరిగాయని బాధితులు ఆరోపిస్తున్నారు. ఆర్థికంగా స్థితిమంతులుగా ఉన్నవారికి, రాజకీయ పలుకుబడి కలిగినవారికి ఇళ్లు కేటాయించగా, నిజమైన అర్హులైన పేద కుటుంబాలకు మాత్రం నిరాశే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గ్రామంలో కొందరు నిరుపేద కుటుంబాలు ఇప్పటికీ సొంత ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్నాయని, ఇందిరమ్మ ఇల్లు వస్తుందనే ఆశతో ఎదురుచూస్తున్నామని బాధితులు చెబుతున్నారు. అయితే రెండో విడత కేటాయింపుల్లో కూడా తమకు అవకాశం దక్కకపోవడంతో కన్నీటి పర్యంతమవుతున్నారు.ఈ విషయాన్ని గ్రామ సర్పంచి దృష్టికి తీసుకెళ్లగా, ప్రస్తుతం లిస్ట్-1లో ఉన్న అర్హులకు ఇళ్లు కేటాయిస్తున్నామని, లిస్ట్-2, లిస్ట్-3లో ఉన్నవారికి తదుపరి విడతల్లో అవకాశం కల్పిస్తామని సమాధానం ఇచ్చినట్లు గ్రామస్తులు పేర్కొంటున్నారు.అయితే అసలు వివాదానికి కారణం ప్రజాపాలన దరఖాస్తుల సమయంలో నిర్వహించిన సర్వేలోనే ఉందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఎన్యుమరేటర్ల ద్వారా వివరాలు సేకరించే సమయంలో అర్హులైన నిరుపేద కుటుంబాల పూర్తి సమాచారాన్ని నమోదు చేయకపోవడం వల్ల కొందరి పేర్లు లిస్ట్-1లోకి వెళ్లగా, నిజమైన అర్హుల పేర్లు లిస్ట్-2, లిస్ట్-3లోకి వెళ్లాయని వారు అంటున్నారు. దీంతో రెండో విడతలోనూ అర్హులకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వానికి గ్రామస్తుల విజ్ఞప్తి:ఖాతా గ్రామంలో మరోసారి సమగ్ర సర్వే నిర్వహించి, నిజమైన నిరుపేద కుటుంబాలను గుర్తించి అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. రెండో విడత కేటాయింపులపై సంబంధిత అధికారులు విచారణ జరిపి, ఆరోపణలు నిజమని తేలితే తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చాల్సిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో రాజకీయ పలుకుబడికి, కుటుంబ సంబంధాలకు తావు లేకుండా పారదర్శకంగా అర్హులకే ఇళ్లు కేటాయించాలని ఖాతా గ్రామ ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.