**సిబ్బంది సంక్షేమానికి పెద్దపీట.. రూ.15 లక్షల బీమా ప్రీమియం చెల్లింపు*
నవంబర్ 2:
హనుమకొండ జిల్లా వేలేరు మేజర్ గ్రామపంచాయతీలో పనిచేస్తున్న సిబ్బంది సంక్షేమానికి సర్పంచ్ బిల్లా యాదగిరి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. గ్రామపంచాయతీలో విధులు నిర్వహిస్తున్న 18 మంది సిబ్బందికి ఒక్కొక్కరికి రూ.15 లక్షల చొప్పున ప్రమాద బీమా సదుపాయం కల్పిస్తూ, తపాలా శాఖ (పోస్ట్ ఆఫీస్) ద్వారా వార్షిక బీమా ప్రీమియం మొత్తాన్ని చెల్లించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ బిల్లా యాదగిరి మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ సిబ్బంది ప్రతిరోజూ క్షేత్రస్థాయిలో ప్రజలకు వివిధ సేవలు అందిస్తూ గ్రామ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. విధి నిర్వహణలో అనుకోని ప్రమాదాలు సంభవించినప్పుడు సిబ్బంది కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులకు గురికాకుండా వారికి అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ ప్రమాద బీమా సదుపాయాన్ని కల్పించినట్లు పేర్కొన్నారు.
ప్రతి ఉద్యోగి కుటుంబ భద్రతకు భరోసా కల్పించడం, ఆపద సమయంలో వారి కుటుంబాలకు ఆర్థిక చేయూత అందించడం ఈ బీమా లక్ష్యమని వివరించారు. గ్రామపంచాయతీ అభివృద్ధితో పాటు ప్రజలకు నిరంతరం సేవలందిస్తున్న సిబ్బంది సంక్షేమానికి కూడా ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ఈ సందర్భంగా సిబ్బంది అంకితభావంతో అందిస్తున్న సేవలను అభినందించారు.
ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి విజయ, తపాలా శాఖ అధికారి నవ్య, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

