📄 ePaper
Epaper 2
Monday, November 2, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణమురసు తుపాను నేపథ్యంలో రాష్ట్ర యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి: హోంమంత్రి అనిత

మురసు తుపాను నేపథ్యంలో రాష్ట్ర యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి: హోంమంత్రి అనిత

📰 Generate e-Paper Clip

మురసు తుపాను నేపథ్యంలో రాష్ట్ర యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి: హోంమంత్రి అనిత

ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి నవంబర్ 1 అమరావతి

అమరావతి, నవంబర్ 01:-
మురసు తుపాను హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులతో హోంమంత్రి వంగలపూడి అనిత సమీక్ష నిర్వహించారు. వరుస తుపానుల నేపథ్యంలో రాష్ట్ర యంత్రాంగం అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.మురసు తుపాను ప్రభావంతో తీరప్రాంత జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రేపు, ఎల్లుండి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. అర్నబ్ తుపాను సమయంలో సమర్థవంతంగా పనిచేసిన విధంగానే మురసు తుపానును ఎదుర్కొనేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో సంసిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు.

ప్రభావిత జిల్లాల వారీగా 24 గంటల పాటు పనిచేసే అత్యవసర కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసి నిరంతరం పరిస్థితులను పర్యవేక్షించాలని ఆదేశించారు. ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను ముందస్తుగా ప్రభావిత జిల్లాల్లో సిద్ధంగా ఉంచాలని సూచించారు. లోతట్టు, ముంపు ప్రాంతాల్లో నివసించే ప్రజలతో పాటు శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ఉండే వారిని గుర్తించి తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని మంత్రి ఆదేశించారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని, ప్రజలు అధికారిక హెచ్చరికలను నిర్లక్ష్యం చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ప్రధాన రహదారులపై చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోతే వెంటనే తొలగించేందుకు ప్రత్యేక కంట్రోల్ టీమ్‌లను సిద్ధంగా ఉంచాలని సూచించారు. పోలీస్, అగ్నిమాపక, రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్ శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి అత్యవసర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవాలని ఆదేశించారు.

తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజలు తమ సమస్యలను మనమిత్ర వాట్సప్ నంబర్ 9552300009 ద్వారా వెంటనే తెలియజేయాలని హోంమంత్రి సూచించారు. అత్యవసర సహాయం, సమాచారం కోసం విపత్తుల నిర్వహణ సంస్థకు చెందిన 112, 1070, 18004250101 నంబర్లను సంప్రదించాలని కోరారు.తుపాను ప్రభావాన్ని తగ్గించేందుకు ముందస్తు జాగ్రత్తలు, సహాయక చర్యలు, ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని హోంమంత్రి అనిత అధికారులకు స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.