*దళిత మహిళలపై దాడికి పాల్పడిన మతోన్మాద దుండగులను కఠినంగా శిక్షించాలి!*
*లౌకిక రాజ్యంలో ఎవరికైనా మత స్వేచ్ఛ ఉంటుంది – మహిళలపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోం*
*ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే జోక్యం చేసుకోవాలి*
*కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున**
*నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి*
తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ బడంగ్‌పేట అల్మాస్గూడ ప్రాంతంలో బైబిల్ కరపత్రాలు పంపిణీ చేస్తున్నారనే నెపంతో ఇద్దరు దళిత మహిళలపై ఆర్ఎస్ఎస్ కు చెందిన మతోన్మాద శక్తులు పరుష పదజాలంతో దూషిస్తూ భౌతిక దాడులకు పాల్పడిన ఘటనను కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) నల్లగొండ జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది. ఈ మేరకు బుధవారం కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున ఒక ప్రకటన విడుదల చేస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య, లౌకిక రాజ్యమైన భారతదేశంలో ప్రతి పౌరుడికి తనకు నచ్చిన మతాన్ని విశ్వసించే, ఆచరించే, ప్రచారం చేసుకునే హక్కు రాజ్యాంగం కల్పించిందని తెలిపారు. బైబిల్ కరపత్రాలు పంపిణీ చేయడం వారి మత స్వేచ్ఛకు సంబంధించిన విషయమని, ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే చట్టబద్ధంగా ఫిర్యాదు చేయాలి తప్ప మహిళలపై దాడులు చేయడానికి ఎవరికీ అధికారం లేదని స్పష్టం చేశారు. అసలు ప్రశ్న ఏమిటంటే.. ఈ దేశంలో మత స్వేచ్ఛ ఎవరికైనా ఉందా? లేక ఒక మతానికి చెందిన వారు మాత్రమే తమ మతాన్ని ప్రచారం చేసుకోవాలా? రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? మహిళలపై దాడులు జరుగుతుంటే ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం ఎందుకు మౌనంగా ఉండాలి? అని ప్రశ్నించారు. మహిళలను బహిరంగంగా అవమానిస్తూ, దాడులకు పాల్పడటం ప్రజాస్వామ్య విలువలకు, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. ముఖ్యంగా దళిత మహిళలపై ఇలాంటి దాడులు జరగడం సమాజంలో కుల, మత ఆధిపత్య భావజాలం ఎంత ప్రమాదకరంగా మారుతుందో తెలియజేస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఘటనపై తక్షణమే జోక్యం చేసుకోవాలి. పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి దాడికి పాల్పడిన వారిని గుర్తించి, సంబంధిత చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకునేలా ఆదేశించాలి. బాధిత మహిళలకు తగిన రక్షణ కల్పించడంతో పాటు వారికి న్యాయం చేయాలి. ఈ ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించి, భవిష్యత్తులో ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మతం పేరుతో విద్వేషాలను రెచ్చగొట్టే శక్తులను అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి ప్రజాస్వామికవాదిపై ఉందన్నారు. మత స్వేచ్ఛ, మహిళల ఆత్మగౌరవం, దళితుల హక్కులు, రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ గొంతెత్తాలని, రాజకీయాలకు అతీతంగా ఈ దాడిని ఖండించాలని పిలుపునిచ్చారు. మతం వ్యక్తిగత విశ్వాసం – దాడులు చేసే హక్కు ఎవరికీ లేదు. రాజ్యాంగం ముందు అందరూ సమానులే. దళిత మహిళలకు న్యాయం జరిగే వరకు ప్రజాస్వామిక శక్తులు పోరాడాలి.

