📄 ePaper
Epaper 2
Thursday, November 5, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణబాలికల భద్రతకు భరోసా ఇచ్చిన పోలీస్ శాఖ

బాలికల భద్రతకు భరోసా ఇచ్చిన పోలీస్ శాఖ

📰 Generate e-Paper Clip

బాలికల భద్రతకు భరోసా ఇచ్చిన పోలీస్ శాఖ

మహిళల భద్రతే పోలీసుల ప్రథమ కర్తవ్యం

పోక్సో చట్టంపై బుస్సాపూర్‌లో పోలీసుల అవగాహన సదస్సు

మహిళలకు భరోసా
ఆకతాయిలకు హెచ్చరిక

*ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)*:-

గోవిందరావు పేట మండలం,బుస్సాపూర్ గ్రామంలో
మహిళలు, బాలికల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, వారిపై జరిగే నేరాలను అరికట్టేందుకు పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తోందని పోలీసులు స్పష్టం చేశారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా, వేధింపులకు పాల్పడినా, ఈవ్ టీజింగ్ చేసినా, బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడినా చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు, ములుగు జిల్లా ఎస్పీ కేకేన్ సుధీర్ రామనాథన్ ఐపీఎస్ గారి ఆదేశాలతో, ములుగు డీఎస్పీ రవీందర్ గారి సూచనల మేరకు, పస్రా సీఐ దయాకర్ గారి పర్యవేక్షణలో ఎస్సై తాజుద్దీన్ గారి ఆధ్వర్యంలో బుస్సాపూర్ గ్రామంలో మహిళలు, గ్రామస్తులకు. ప్రజలకు పోక్సో చట్టం, మహిళల భద్రత, బాలికల రక్షణపై ప్రత్యేక అవగాహన, చైతన్య సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా స్థానిక పోలీసు అధికారులు మాట్లాడుతూ.. మహిళలు, బాలికలపై జరిగే లైంగిక వేధింపులు, అసభ్య ప్రవర్తన, వెంటపడటం, ఈవ్ టీజింగ్, బెదిరింపులు వంటి చర్యలను ఏమాత్రం ఉపేక్షించేది లేదన్నారు. ముఖ్యంగా 18 ఏళ్లలోపు బాలబాలికలపై లైంగిక దాడులు, వేధింపులకు పాల్పడితే పోక్సో చట్టం-2012 ప్రకారం నేర తీవ్రతను బట్టి కఠిన శిక్షలు విధించబడతాయని వివరించారు.
ఆకతాయిలకు చట్టం హెచ్చరిక..
మహిళలను ఉద్దేశించి అసభ్యకర వ్యాఖ్యలు చేయడం, వెంటపడటం, ఫోన్ కాల్స్ లేదా సోషల్ మీడియా ద్వారా వేధించడం, అనుమతి లేకుండా వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు పంచుకోవడం వంటి చర్యలు నేరాల పరిధిలోకి వస్తాయని తెలిపారు. ఇలాంటి ఘటనలకు పాల్పడే వారిపై భారతీయ న్యాయ సంహిత (BNS), పోక్సో చట్టం తదితర సంబంధిత చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మహిళలు, బాలికలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా తమకు ఎదురయ్యే వేధింపులపై ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో 112కు, మహిళల సహాయం కోసం 181కు, బాలల రక్షణ కోసం 1098 హెల్ప్‌లైన్‌కు సంప్రదించవచ్చని వివరించారు.
మహిళల రక్షణకు షీ టీమ్స్ ప్రత్యేక నిఘా..
మహిళల భద్రత కోసం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో షీ టీమ్స్ నిరంతరం పనిచేస్తున్నాయని, మహిళలు, విద్యార్థినులు ఎదుర్కొనే వేధింపులపై ఫిర్యాదులు స్వీకరించి తగిన చర్యలు తీసుకుంటాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ మహిళల భద్రత, బాలల హక్కులు, చట్టాలపై నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు.
మహిళల గౌరవం, బాలికల భద్రత కాపాడటం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని, నేరాల నియంత్రణలో ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణతో పాటు మహిళలు, బాలల భద్రతకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.