ఘట్‌కేసర్, నవంబర్ 5 (ప్రజావాణి): దీపావళి పండుగ నేపథ్యంలో ప్రజల ప్రాణ, ఆస్తి భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాణసంచా దుకాణాలపై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఘట్‌కేసర్ ఎస్‌హెచ్‌ఓ పి. కిరణ్ తన సిబ్బందితో కలిసి శాశ్వత, తాత్కాలిక బాణసంచా దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా దుకాణాల్లో బాణసంచా నిల్వలు, భద్రతా ఏర్పాట్లు, అగ్నిమాపక పరికరాలను స్వయంగా పరిశీలించారు. నిబంధనల ప్రకారం అవసరమైన పోలీసు, అగ్నిమాపక శాఖ అనుమతులు కలిగి ఉన్నవారు మాత్రమే బాణసంచా విక్రయించాలని వ్యాపారులకు స్పష్టం చేశారు. ప్రతి దుకాణం వద్ద అగ్నిమాపక యంత్రాలు, నీటి బకెట్లు, ఇసుక బకెట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. దుకాణాల మధ్య తగినంత దూరం పాటించాలని, విద్యుత్ వైరింగ్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. దుకాణాల పరిసరాల్లో ధూమపానం, బహిరంగ మంటలు పూర్తిగా నిషేధమని, అనుమతించిన పరిమితికి మించి బాణసంచా నిల్వ చేయరాదని హెచ్చరించారు.
ఈ సందర్భంగా ఎస్‌హెచ్‌ఓ పి. కిరణ్ మాట్లాడుతూ.. భద్రతా నిబంధనలు ఉల్లంఘించినా, అక్రమంగా బాణసంచా విక్రయించినా సంబంధిత దుకాణాలను సీజ్ చేయడంతో పాటు బాధ్యులపై కఠిన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రజల భద్రతే పోలీసుల ప్రథమ కర్తవ్యమని పేర్కొంటూ, ప్రజలు సైతం లైసెన్స్ పొందిన దుకాణాల్లోనే బాణసంచా కొనుగోలు చేసి, తగిన జాగ్రత్తలు పాటిస్తూ దీపావళి పండుగను సురక్షితంగా జరుపుకోవాలని ఎస్‌హెచ్‌ఓ పి. కిరణ్ విజ్ఞప్తి చేశారు.


