📄 ePaper
Epaper 2
Tuesday, November 10, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణగుడుంబా దందా.. C/o కిరాణా కోట్లు

గుడుంబా దందా.. C/o కిరాణా కోట్లు

📰 Generate e-Paper Clip

గుడుంబా దందా.. C/o కిరాణా కోట్లు!

* అడవుల్లో గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడులు.. మరోవైపు అక్రమంగా ముడిసరుకు సరఫరా

* మండల కేంద్రంలో ఇద్దరు వ్యాపారుల గోదాముల్లో భారీగా బెల్లం, పట్టిక నిల్వలు?

* సివిల్ సప్లైస్, ఎక్సైజ్ శాఖల నిఘా లోపంపై ఆదివాసి సంఘాల ఆగ్రహం

వెంకటాపురం (నూగురు), నవంబరు 10 (ప్రజావాణి): ఏజెన్సీ ప్రాంతమైన వెంకటాపురం మండలంలో గుడుంబా దందా బారిన పడి పచ్చని పల్లెల్లోని యువత భవిష్యత్తు అంధకారమవుతోంది. ఈ క్రమంలో వెంకటాపురం అడవుల్లో గుడుంబా స్థావరాలపై గత కొన్ని రోజులుగా పోలీసులు విస్తృతంగా దాడులు నిర్వహిస్తూ, వేలాది లీటర్ల పానకాన్ని ధ్వంసం చేస్తున్నారు. అయితే, గుడుంబా తయారీకి అవసరమైన బెల్లం, పంచదార, పట్టిక ఎక్కడి నుంచి సరఫరా అవుతున్నాయనే ప్రశ్నకు మాత్రం క్షేత్రస్థాయిలో సరైన సమాధానం కరువవుతోంది. మండల కేంద్రంలో గుడుంబా తయారీ వెనుక ముడిసరుకు సరఫరా వ్యవస్థ బలంగా మారిందనే ఆరోపణలు స్థానికంగా వెల్లువెత్తుతున్నాయి.
వ్యాపారుల కనుసన్నల్లోనే సరఫరా..
స్థానిక ప్రజాసంఘాలు, ఆదివాసి సంఘాల ప్రతినిధులు తెలిపిన వివరాల ప్రకారం.. అడవుల్లో గుడుంబా స్థావరాలపై పోలీసులు దాడులు చేస్తున్నప్పటికీ, ఊరిలో బెల్లం, పట్టిక వ్యాపారుల దందా యథేచ్ఛగా సాగుతోంది. అప్పుగానైనా గుడుంబా తయారీదారులకు ముడిసరుకును చేరవేస్తున్నట్లు సమాచారం. వెంకటాపురం మండల కేంద్రంలో ఇద్దరు వ్యాపారులకు చెందిన గోదాముల్లో ఈ ముడిసరుకులు భారీగా నిల్వ ఉన్నాయని, వారి కనుసన్నల్లోనే గుడుంబా తయారీ సాగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
నిఘా కరువైన సివిల్ సప్లైస్, ఎక్సైజ్ శాఖలు.. బెల్లం, పంచదార, పట్టిక విక్రయాలపై నిరంతరం పర్యవేక్షించాల్సిన సివిల్ సప్లైస్ మరియు ఎక్సైజ్ శాఖల అధికారుల నిఘా పూర్తిగా కొరవడిందని ఏఐఎంఎస్ మహిళా విభాగం మండిపడుతోంది. ములుగు జిల్లా ఉన్నతాధికారులు స్పందించి మండలంలోని నిత్యావసర సరుకుల దుకాణాలు, గోదాములపై తక్షణమే ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. సంబంధిత శాఖలు మామూళ్ల మత్తులో మునిగితేలడం వల్లే ఈ అక్రమ నెట్‌వర్క్‌కు అడ్డుకట్ట పడటం లేదని ఆదివాసి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.