సిఎంఆర్ బియ్యం బకాయిలపై పౌరసరఫరాల శాఖ కఠిన చర్యలు.. !
జిల్లా పౌరసరఫరాల అధికారి చందన్ కుమార్
బియ్యం త్వరగా డెలివరీ చేయాలని మిల్లుల యజమానులకు ఆదేశం
*నిబంధనలు ఉల్లంఘించిన మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు*
ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి
రైస్ మిల్లులలో అక్రమాలు, సిఎంఆర్ బియ్యం బకాయిలపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా పౌరసరఫరాల అధికారి చందన్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టర్ (పౌరసరఫరాలు) ఆదేశాల మేరకు జిల్లాలోని పలు రైస్ మిల్లులపై విస్తృత తనిఖీలు చేపట్టినట్లు అన్నారు.
నేలకొండపల్లి మండలంలోని రైస్ మిల్లులపై ఇటీవల వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా దుర్గాభవాని రైస్ మిల్లును ఆకస్మికంగా తనిఖీ చేసినట్లు, తనిఖీల్లో సీఎంఆర్ డెలివరీ చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతున్నట్లు గుర్తించామన్నారు. వెంటనే స్పందించి, నిర్దేశిత గడువులోగా సీఎంఆర్ బియ్యాన్ని పూర్తిస్థాయిలో డెలివరీ చేయాలని మిల్లు యజమానిని కఠినంగా ఆదేశించామన్నారు. ఆదేశాలను పాటించని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు తెలిపారు.
గత రెండు నెలల కాలంలో జిల్లాలోని 15 రైస్ మిల్లులపై విజిలెన్స్ విభాగానికి చెందిన అధికారులు దాడులు నిర్వహించారని, ఈ దాడుల్లో గుర్తించిన ధాన్యం కొరతకు సంబంధించి ఆయా మిల్లర్లకు నోటీసులు జారీ చేసినట్లు జిల్లా పౌరసరఫరాల అధికారి తెలిపారు. విజిలెన్స్ తనిఖీల ఆధారంగా మిల్లర్లు మొత్తం రూ. 64.63 కోట్లు చెల్లించాల్సి ఉండగా, ఇప్పటి వరకు రూ. 47.81 కోట్లు రికవరీ చేయడం జరిగిందని అన్నారు. మిగిలిన బాకీ పడిన మొత్తాన్ని చెల్లించని ఇద్దరు మిల్లర్లకు పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ స్పందించకపోవడంతో, నిబంధనల ప్రకారం వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. సాధారణ క్షేత్రస్థాయి తనిఖీలలో స్టాక్ కొరత ఉన్నట్లు తేలడంతో మరో 3 మిల్లులపై నోటీసుల అనంతరం క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరిగిందని జిల్లా పౌరసరఫరాల అధికారి తెలిపారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి వారం బుధవారం రోజున పౌరసరఫరాల కమిషనర్ పివియాప్ ద్వారా జిల్లాలోని రైస్ మిల్లులలో భౌతిక తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ తనిఖీల విశ్వసనీయత కోసం కమిషనర్ కార్యాలయ ప్రత్యేక బృందం ద్వారా సూపర్ చెక్ కూడా చేపడుతున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో స్టాక్ వ్యత్యాసాలు లేదా కొరత ఉన్నట్లు తేలితే సదరు మిల్లులపై కఠిన చర్యలు ఉంటాయని పౌరసరఫరాల అధికారి ఆ ప్రకటనలో హెచ్చరించారు.

