📄 ePaper
Epaper 2
Wednesday, October 14, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణరేషన్ షాపుల ద్వారా 14 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలి

రేషన్ షాపుల ద్వారా 14 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలి

📰 Generate e-Paper Clip

రేషన్ షాపుల ద్వారా 14 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలి

పెంచిన గ్యాస్ ధరలను ఉపసంహరించుకోవాలి – ఐద్వా జిల్లా కార్యదర్శి పాలడుగు ప్రభావతి

నల్లగొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి

రేషన్ షాపుల ద్వారా 14 రకాల నిత్యావసర సరుకులను పంపిణీ చేయాలని, పెంచిన వంటగ్యాస్ ధరలను ఉపసంహరించుకోవాలని, నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) నల్లగొండ జిల్లా కార్యదర్శి పాలడుగు ప్రభావతి డిమాండ్ చేశారు. బుధవారం నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ) దశరథ కు ఐద్వా నల్లగొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పాలడుగు ప్రభావతి మాట్లాడుతూ, రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో పేద, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అన్నారు. బియ్యం, పప్పులు, వంటనూనెలు, కూరగాయల ధరలు పెరగడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని పేర్కొన్నారు. మరోవైపు వంటగ్యాస్ ధరల పెరుగుదల మహిళలపై అదనపు ఆర్థిక భారాన్ని మోపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు ఆహార భద్రత కల్పించాల్సిన ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రభుత్వం మరింత పటిష్టపరచాలని ఆమె కోరారు. రేషన్ షాపుల ద్వారా బియ్యంతో పాటు పప్పులు, వంటనూనె, చక్కెర తదితర 14 రకాల నిత్యావసర సరుకులను అందించాలని డిమాండ్ చేశారు. పెంచిన వంటగ్యాస్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని, నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించేందుకు ప్రభుత్వం సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని కోరారు. మహిళలు, బాలికలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలల ద్వారా అమలవుతున్న పౌష్టికాహార పథకాలను సమర్థవంతంగా నిర్వహించాలని అన్నారు. అర్హులైన పేద కుటుంబాలందరికీ రేషన్ కార్డులు మంజూరు చేయాలని, రేషన్ డీలర్లు లేని ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. జనాభాకు అనుగుణంగా కొత్త రేషన్ షాపులను ఏర్పాటు చేసి, ప్రజలకు రేషన్ సరుకులు సక్రమంగా అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. నిత్యావసర వస్తువులను అధిక ధరలకు విక్రయించడం, అక్రమ నిల్వలు, ఆహార పదార్థాల కల్తీ వంటి అక్రమాలను అరికట్టేందుకు సంబంధిత శాఖల అధికారులు నిరంతరం తనిఖీలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. రేషన్ సరుకుల పంపిణీలో అక్రమాలు, తూకాల్లో మోసాలు జరగకుండా పర్యవేక్షణ పెంచాలని, ప్రజల ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని కోరారు. ప్రజల ఆహార భద్రతను కాపాడటంతో పాటు మహిళలు, బాలికల ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు ప్రభుత్వం తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని పాలడుగు ప్రభావతి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా నాయకులు కొండ అనురాధ, పాతూరి గోవర్ధన, చనబోయిన నాగమణి, కౌసల్య,వెంకటమ్మ, సుల్తానా, సాయిదమ్మ ,ఉమా, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.