*కలెక్టరేట్లో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు
*
*ప్రకృతి పండుగ బతుకమ్మ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక*
*జిల్లా విద్యాశాఖ అధికారి రేణుక*
మేడ్చల్, నేటి ప్రస్థానం:- బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే ప్రకృతి పండుగ అని జిల్లా విద్యాశాఖ అధికారి రేణుక అన్నారు. ప్రకృతిలో సహజంగా లభించే గునుగు, తంగేడు, బంతి, చామంతి తదితర రకాల పూలతో బతుకమ్మలను పేర్చి, పండుగ ముగిసిన అనంతరం ఆ పూలను నీటిలో నిమజ్జనం చేయడం ఈ పండుగ ప్రత్యేకత అని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిచ్చే ఈ పండుగ తెలంగాణ ప్రజల జీవన విధానానికి, సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. శుక్రవారం మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. జిల్లా ప్రణాళిక శాఖ, జిల్లా విద్యాశాఖ, జిల్లా సహకార శాఖ, ఐసీడీఎస్, డీఐఈఓ, ఆర్అండ్బీ, జిల్లా సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వివిధ రకాల రంగురంగుల పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తెలంగాణ సంప్రదాయాలను ప్రతిబింబించేలా మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి బతుకమ్మల చుట్టూ చేరి పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. బతుకమ్మ పాటలు, కోలాటాలు, సంప్రదాయ నృత్యాలతో కలెక్టరేట్ ప్రాంగణం సందడిగా మారింది. తెలంగాణ ఆడపడుచులు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే బతుకమ్మ పండుగ మహిళల ఐక్యతకు, ప్రకృతిపై ప్రేమకు ప్రతీకగా నిలుస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. పూలను పూజించడం, ప్రకృతిలో లభించే సహజ వనరులకు ప్రాధాన్యతనివ్వడం ద్వారా పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని ఈ పండుగ అందిస్తుందని తెలిపారు. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల వైభవాన్ని చాటిచెప్పాయి. అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొనడంతో కలెక్టరేట్ ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది.

