మూడో విడత ఇందిరమ్మ లబ్ధిదారులకు న్యాయం చేయాలి
జనగామ ఆర్డీవో ఆఫీస్ ముందు సీపీఎం మహాధర్నా
పేదల ఇళ్లకు ఇంటి నంబర్లు వేయాలి
72 మంది డబుల్ బెడ్రూం బాధితులకు న్యాయం చేయాలని సీపీఎం డిమాండ్
జిల్లా ఇంచార్జ్ మంత్రి పొంగులేటి జోక్యం చేసుకోవాలి
సీపీఎం రాష్ట్ర నేత ఎండీ అబ్బాస్ అల్టిమేటం
జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 30 (ప్రజావాణి):జనగామ పట్టణంలో మూడో విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు నిర్మించుకున్న ఇళ్లకు వెంటనే ఇంటి నంబర్లు కేటాయించాలని, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం కారణంగా ఇళ్లు కోల్పోయిన 72 మంది కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించాలని, వీరనారి ఐలమ్మ నగర్లో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం జనగామ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం జనగామ ఆర్డీవో కార్యాలయం ముందు మహాధర్నా నిర్వహించారు.
ఈ ధర్నాకు సీపీఎం జనగామ పట్టణ కార్యదర్శి జోగు ప్రకాష్ అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథులుగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండీ అబ్బాస్, జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్బంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ
2012-2013 సంవత్సరాల్లో అప్పటి కాంగ్రెస్ (ఇందిరమ్మ) ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు మంజూరు చేసిందని, వాటి ఆధారంగా లబ్ధిదారులు తమ సొంత ఖర్చులతో, అప్పులు చేసి ఇళ్లను నిర్మించుకున్నారని తెలిపారు.
ప్రస్తుతం ఆ పట్టాలను తిరిగి తీసుకొని కొత్తవారికి కేటాయిస్తామని చెప్పడం వల్ల పేద కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయని, ఏళ్ల తరబడి కష్టపడి నిర్మించుకున్న ఇళ్లను లబ్ధిదారుల నుంచి తిరిగి తీసుకోవాలనే ఆలోచన ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
గతంలో ప్రభుత్వం లబ్ధిదారుల వద్ద పట్టా పేపర్ జిరాక్స్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కుటుంబ సభ్యుల వివరాలు తీసుకుందని, కాబట్టి ఇచ్చిన పట్టాలకు గౌరవం ఇచ్చి లబ్ధిదారులకు న్యాయం చేయాలని కోరారు.
మూడో విడత ఇందిరమ్మ లబ్ధిదారులు నిర్మించుకున్న ఇళ్లకు వెంటనే ఇంటి నంబర్లు కేటాయించాలని,
డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం సందర్భంగా ఇళ్లు కోల్పోయిన 72 మంది పేదలకు వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించాలని,
వీరనారి ఐలమ్మ నగర్లో తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, విద్యుత్ వంటి కనీస మౌలిక వసతులు కల్పించాలని,
జిల్లా ఇంచార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మూడో విడత ఇందిరమ్మ లబ్ధిదారుల విషయంలో చొరవ తీసుకోవాలని, అప్పుడు ఇచ్చింది ఇందిరమ్మ ప్రభుత్వమే కాబట్టి ఇల్లు కట్టుకున్న ప్రతి ఒక్కరికీ ఇంటి నంబర్ వేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పేదలకు అన్యాయం చేస్తే సీపీఎం ఊరుకోదని హెచ్చరించారు.
పేదలు ఎన్నో కష్టాలు పడి నిర్మించుకున్న ఇళ్లకు భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని, వారి నివాస హక్కులకు భంగం కలిగించకుండా తక్షణమే సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పేదల పక్షాన సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బొట్ల శేఖర్, జిల్లా కమిటీ సభ్యులు బూడిద గోపి, పట్టణ కమిటీ సభ్యులు కళ్యాణం లింగం, పగిడిపల్లి బాలమణి, నాయకులు రమావత్ నిత్య నాయక్, దామెర అబ్రహం లింకన్, ఎండీ గౌసియా, కచగల వెంకటేష్, మాదాసు సుధాకర్, మునిసిపట్ల జయరాల, ఉపేందర్ రాజు, కొల్లిపాక నరసింహులు, వెలిశెట్టి కృష్ణ, తిమోతి, సౌందర్య, అండాలు, పద్మ, ఎండీ అమ్ములు, గంపల సతీష్, రమేష్, పద్మ, అంజమ్మ, బండ రమాదేవి, మట్ట కవిత, కొలిపాక వెంకటలక్ష్మి, నాజియా తదితరులు పాల్గొన్నారు.



