మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో గుంటూరు, తెనాలి పట్టణాల్లో హోటళ్లు, లాడ్జీలలో పోలీసుల విస్తృత తనిఖీలు
ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి అక్టోబర్ 31 గుంటూరు జిల్లా
– ఎన్నికల్లో బయటి వ్యక్తుల జోక్యాన్ని నివారించేందుకు ముందస్తు చర్యలు
– ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు తప్పవు
– అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై పోలీసులకు సమాచారం అందించాలి
స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు గుంటూరు జిల్లా పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. గుంటూరు నగరం, తెనాలి పట్టణంలోని వివిధ హోటళ్లు, లాడ్జీలలో శుక్రవారం రాత్రి నుండి పోలీసులు తనిఖీలు నిర్వహించు చున్నారు.
గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఎన్నికల ప్రక్రియలో బయటి వ్యక్తులు అనవసరంగా జోక్యం చేసుకోకుండా, ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి నేరాలకు పాల్పడకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ తనిఖీలు చేపట్టారు. హోటళ్లు, లాడ్జీలలో బస చేస్తున్న వ్యక్తుల వివరాలను పరిశీలిస్తూ, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.
ఎన్నికల నేపథ్యంలో ఈ తనిఖీలు కొనసాగుతాయని, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినా, ఎన్నికలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడినా సంబంధిత వ్యక్తులపై చట్టప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
*బయటి ప్రాంతాలకు చెందిన వ్యక్తులకు పోలీసుల విజ్ఞప్తి*
గుంటూరు నగరం, తెనాలి పట్టణాల్లో మున్సిపల్ ఎన్నికలతో సంబంధం లేని బయటి ప్రాంతాల వ్యక్తులు, ఇతర ప్రాంతాలకు చెందిన రాజకీయ నాయకులు ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసే ఉద్దేశంతో ఉండరాదని పోలీసులు సూచించారు. ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ, అనుమతులు అవసరమైన సందర్భాల్లో సంబంధిత నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.
అలాగే, ఎన్నికలు పూర్తయ్యే వరకు అనుమానాస్పద వ్యక్తుల కదలికలను ప్రజలు గమనించాలని, ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించే ప్రయత్నాలు లేదా అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని గుంటూరు జిల్లా పోలీసులు విజ్ఞప్తి చేశారు. అందిన సమాచారాన్ని పరిశీలించి, విచారణ అనంతరం చట్టప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని గుంటూరు జిల్లా పోలీసులు కోరారు.

