మిట్టకోడూరులో వివాదాస్పదంగా మారిన గ్రామసభ: ఆలయంలో నిర్వహణపై వార్డు సభ్యుల ఆగ్రహం
పరిగి, అక్టోబర్02 ( ప్రజావాణి):
వికారాబాద్ జిల్లా పరిగి మండలం మిట్టకోడూరు గ్రామ పంచాయతీలో నిర్వహించిన గ్రామసభ తీవ్ర వివాదాస్పదంగా మారింది. అధికారికంగా గ్రామ పంచాయతీ భవనంలో జరగాల్సిన గ్రామసభను స్థానిక ఆలయంలో నిర్వహించడంపై పలువురు వార్డు సభ్యులు, గ్రామస్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వార్డు సభ్యులు మాట్లాడుతూ— గ్రామ సర్పంచ్ మాణిక్యం, పంచాయతీ సెక్రటరీ నిబంధనలకు విరుద్ధంగా, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పంచాయతీ కార్యాలయంలో కాకుండా గుడి ప్రాంగణంలో సభ ఏర్పాటు చేయడం ఏమిటని మండిపడ్డారు. పాలకవర్గంలోని సభ్యులందరినీ సమన్వయం చేసుకోకుండా, కేవలం ముగ్గురు వార్డు సభ్యులు, కొద్దిమంది గ్రామస్థులతోనే గుడిలో మమ అనిపించేలా సభను ముగించడంపై విమర్శలు వెల్లువెత్తాయి.
ప్రజా సమస్యలపై పారదర్శకంగా చర్చించాల్సిన గ్రామసభను ఇలా రహస్యంగా, నిబంధనలు గాలికొదిలేసి నిర్వహించడం సరైంది కాదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఈ వ్యవహారంపై విచారణ జరపాలని, సభను రద్దు చేసి నిబంధనల ప్రకారం పంచాయతీ కార్యాలయంలోనే తిరిగి గ్రామసభను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

