జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
నూతన మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలి.. ప్రత్యేక రక్షణ చట్టం తేవాలి
టీయూడబ్ల్యూజే-ఐజేయూ జిల్లా అధ్యక్షుడు మల్లవర్జుల వంశీ విద్యానంద్, ప్రధాన కార్యదర్శి నారాయణదాసు అశోక్
ప్రజావాణి జిల్లా ప్రతినిధి
పెద్దపల్లి, అక్టోబర్ 2:
జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించి, వారి హక్కులు, భద్రతకు పటిష్టమైన రక్షణ కల్పించాలని టీయూడబ్ల్యూజే-ఐజేయూ జిల్లా అధ్యక్షుడు మల్లవర్జుల వంశీ విద్యానంద్, జిల్లా ప్రధాన కార్యదర్శి నారాయణదాసు అశోక్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) జాతీయ కార్యవర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ‘పాత్రికేయుల డిమాండ్ల దినం’ కార్యక్రమాన్ని నిర్వహించారు.
కార్యక్రమంలో భాగంగా తొలుత గాంధీజీ విగ్రహానికి జర్నలిస్టులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమాజం కోసం ప్రాణాలు అర్పించిన అమర జర్నలిస్టుల స్మారకార్థం రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం జర్నలిస్టుల హక్కులు, భద్రతను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టరేట్‌కు చేరుకుని తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అధికారులకు అందజేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా ఉన్న పత్రికారంగం, మీడియా సిబ్బంది రక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం, డిజిటల్ మీడియా విస్తరణకు అనుగుణంగా నూతన సమగ్ర మీడియా కమిషన్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా జర్నలిస్టులపై జరుగుతున్న భౌతిక దాడులను అరికట్టేందుకు ప్రత్యేక కేంద్ర రక్షణ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. కొత్తగా అమల్లోకి వచ్చిన కార్మిక కోడ్ల కారణంగా నష్టపోయిన జర్నలిస్టుల చట్టబద్ధ రక్షణలను పునరుద్ధరించాలని కోరారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా ఉద్యోగులకు వర్తించేలా నూతన వేతన మండలిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు మంజూరు చేయడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు నగదు రహిత ఉచిత వైద్య సేవలు అందించేలా హెల్త్ కార్డులు మంజూరు చేయాలని కోరారు. గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తున్న జర్నలిస్టులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని, రైల్వే పాసులను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు.
జర్నలిస్టుల సుదీర్ఘకాల డిమాండ్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో భవిష్యత్తులో జిల్లావ్యాప్తంగా శాంతియుతంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని వారు హెచ్చరించారు.
కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే-ఐజేయూకు చెందిన ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా సీనియర్ జర్నలిస్టులు, నియోజకవర్గ, మండల స్థాయి ప్రతినిధులు, పలువురు పాత్రికేయులు పాల్గొన్నారు.

