ధర్మం, ధైర్యం, పట్టుదలకు ప్రతీకలు పాండవులు!
పాండవుల ఆదర్శాలు నేటి యువతకు మార్గదర్శకాలు
గరిడేపల్లి సర్పంచ్ మేకపోతుల వెంకటమ్మ చంద్రయ్య గౌడ్
గరిడేపల్లి, అక్టోబర్ 16 (ప్రజావాణి):
మహాభారతంలో పాండవులు సాగించిన జీవన ప్రస్థానం, వారు ఎదుర్కొన్న ఒడిదుడుకులు, ధర్మం పట్ల చూపిన నిబద్ధత నేటి తరానికి గొప్ప ఆదర్శమని గరిడేపల్లి గ్రామ సర్పంచ్ మేకపోతుల వెంకటమ్మ అన్నారు. కష్టాలను ధైర్యంగా ఎదుర్కొంటూ, న్యాయం మరియు ధర్మం కోసం నిలబడిన పాండవుల జీవిత చరిత్ర ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని ఆమె పేర్కొన్నారు.
గరిడేపల్లి మండల కేంద్రంలో ముదిరాజుల కులదైవంగా కొలిచే పాండవుల ఆలయాన్ని శుక్రవారం సర్పంచ్ మేకపోతుల వెంకటమ్మ, చంద్రయ్య గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తిశ్రద్ధలతో కార్యక్రమాన్ని జరిపారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ.. జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా, ధర్మబద్ధమైన మార్గంలో పయనించడమే పాండవుల జీవితం నేర్పే గొప్ప పాఠమని అన్నారు. పాండవులు ప్రదర్శించిన ధైర్యం, ఐకమత్యం, సహనం, న్యాయనిష్ఠ వంటి సద్గుణాలను నేటి యువత అలవర్చుకోవాలని సూచించారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంపొందించడంతో పాటు, మన సంస్కృతి, సంప్రదాయాలు, పూర్వీకుల వారసత్వాన్ని భావితరాలకు అందించేందుకు దోహదపడతాయని పేర్కొన్నారు.
ముదిరాజుల కులదైవమైన పాండవుల ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా కులస్తులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఆధ్యాత్మికతతో పాటు సామాజిక ఐక్యతను చాటే ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలని పలువురు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు త్రిపుర అంజన్ రెడ్డి, పైడిమర్రి రంగనాథ్, పెండెం శ్రీనివాస్ గౌడ్, బండ నర్సిరెడ్డి, కర్నే అరుణలక్ష్మీనారాయణ, ముదిరాజ్ కులస్తులు చామకూరి నాగేశ్వరరావు, చామకూరి దశరథ, ప్రధాని సైదులు, జిట్టబోయిన పకీరయ్య, మత్స్యకార్మిక సహకార సంఘం డైరెక్టర్లు, పలువురు ముదిరాజ్ కుల పెద్దలు, కులస్తులు పాల్గొన్నారు.

