*దసరా సెలవుల్లో చదువుకు ప్రాధాన్యం, భద్రతకు భరోసా ఇవ్వండి*
విద్యార్థులకు, తల్లిదండ్రులకు చిలిపిచెడ్ ఎంఈఓ పి. విట్టల్ సూచనలు – చదువుతో విజ్ఞానం, భద్రతతో ఆనందం
చిలిపిచెడ్, అక్టోబర్ 9 ప్రజావాణి
దసరా సెలవులను విద్యార్థులందరూ ఆనందంగా, సురక్షితంగా గడుపుతూ చదువుపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలని చిలిపిచెడ్ మండల విద్యాధికారి పి. విట్టల్ పిలుపునిచ్చారు.
గురువారం మండలంలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులకు ఆయన ఒక ప్రకటన ద్వారా పలు సూచనలు చేశారు. సెలవుల సమయంలో ప్రతిరోజూ కొంత సమయాన్ని చదువుకు కేటాయించాలని, పాఠ్యపుస్తకాలు చదవడం, రాయడం, గణితం అభ్యసించడం, ఇంగ్లీష్ పఠన నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం వంటి కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. ఇప్పటివరకు నేర్చుకున్న పాఠాలను పునశ్చరణ చేసుకుంటూ, సెలవుల అనంతరం పాఠశాలలు పునఃప్రారంభమైనప్పుడు పూర్తి సంసిద్ధతతో రావాలని కోరారు.
*భద్రతా సూచనలు తప్పనిసరి:*
ఈ సందర్భంగా ఆయన విద్యార్థుల భద్రత కోసం 7 కీలక సూచనలు చేశారు.
1. దసరా పండుగ, జాతరలు, ఇతర వేడుకలకు తల్లిదండ్రులు లేదా పెద్దలతో కలిసి వెళ్లాలి.
2. ఈత రాని విద్యార్థులు చెరువులు, కుంటలు, కాలువలు, నదుల వద్దకు వెళ్లకూడదు. నీటిలోకి దిగకూడదు.
3. విద్యుత్ తీగలు, ట్రాన్స్ఫార్మర్లు, ప్రమాదకరమైన విద్యుత్ పరికరాలకు దూరంగా ఉండాలి.
4. రహదారి భద్రతా నియమాలు పాటిస్తూ వాహనాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
5. టపాసులు కాల్చేటప్పుడు పెద్దల పర్యవేక్షణ తప్పనిసరి. ప్రమాదకరమైన ఆటలకు దూరంగా ఉండాలి.
6. మొబైల్ ఫోన్, టీవీ వినియోగాన్ని పరిమితం చేసి ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం, తగినంత నిద్రకు ప్రాధాన్యత ఇవ్వాలి.
7. తల్లిదండ్రులకు ఇంటి పనుల్లో సహాయం చేస్తూ, మంచి అలవాట్లను అలవరుచుకోవాలి.
తల్లిదండ్రులు తమ పిల్లల చదువు, ఆరోగ్యం, భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆయన కోరారు. చదువుతో విజ్ఞానం… క్రమశిక్షణతో ఉన్నత స్థానం… భద్రతతో ఆనందమయ జీవనం అనే స్ఫూర్తితో విద్యార్థులందరూ దసరా సెలవులను సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు .

