జర్నలిస్టుల సంక్షేమానికి అండగా నిలవాలి.
* స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌లను కలిసిన టియుడబ్ల్యూజె (H-143) నూతన కార్యవర్గం
* సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని నేతల హామీ
వికారాబాద్/పరిగి,ప్రజావాణి అక్టోబర్ 28:
జిల్లాలోని శ్రమజీవులైన విలేకరుల సంక్షేమానికి, వారి న్యాయమైన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు ఎల్లవేళలా అండగా నిలవాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (TUWJ H-143) వికారాబాద్ జిల్లా నూతన నాయకత్వం విజ్ఞప్తి చేసింది.
బుధవారం తెలంగాణ శాసనసభ స్పీకర్, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్‌ను, అలాగే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్‌లను యూనియన్ నూతన కార్యవర్గ ప్రతినిధులు వేర్వేరుగా మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను ఈ సందర్భంగా నేతల దృష్టికి తీసుకెళ్లారు.
దీనిపై స్పీకర్ ప్రసాద్ కుమార్, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ సానుకూలంగా స్పందిస్తూ… సమాజ హితం కోసం నిరంతరం శ్రమించే జర్నలిస్టుల న్యాయమైన సమస్యల పరిష్కారానికి తమవంతు పూర్తి సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (H-143) వికారాబాద్ జిల్లా నూతన కార్యవర్గ ప్రతినిధులు, సభ్యులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

