జనగామ లో ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు
కొవ్వొత్తుల ర్యాలీ – అమరవీరులకు ఘన నివాళులు..
జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 21(ప్రజావాణి): పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా బుధవారం జనగాం పట్టణంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ ఘనంగా నిర్వహించారు.
జనగాం డీసీపీ రాజా మహేంద్ర నాయక్, ఐపీఎస్ ఆధ్వర్యంలో, జనగాం పోలీస్ స్టేషన్ నుండి ప్రధాన కూడళ్ల మీదుగా ఈ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. చేతిలో కొవ్వొత్తులు పట్టుకుని “అమరవీరులకు జోహార్” అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ సాగింది.
ఈ ర్యాలీ అనంతరం విధి నిర్వహణలో దేశ రక్షణ కోసం, ప్రజల భద్రత కోసం ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి, కొవ్వొత్తులు వెలిగించి రెండు నిమిషాలు మౌనం పాటించి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా డీసీపీ శ్రీ రాజా మహేంద్ర నాయక్, ఐపీఎస్ మాట్లాడుతూ
“పోలీస్ అమరవీరుల త్యాగం వెలకట్టలేనిది. శాంతి భద్రతల పరిరక్షణ కోసం, దేశ సమగ్రతను కాపాడటం కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అసువులు బాసిన అమరవీరులను స్మరించుకోవడం మనందరి బాధ్యత. వారి కుటుంబాలకు అండగా నిలబడాలి. వారి త్యాగాలు, సేవలు నేటి పోలీస్ తరానికి ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకం. ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది వారి స్ఫూర్తితో నిజాయితీగా, నిబద్ధతతో విధులు నిర్వహించాలి” అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జనగాం ఏసీపీ, సీఐలు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బంది, హోంగార్డులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

