*ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తిని అలవర్చుకోవాలి*
—- మాజీ జడ్పీటీసీ అశ్విని జాదవ్
*రాయికల్, అక్టోబర్ 23 (ప్రజావాణి)*
గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తిని అలవర్చుకోవాలని రాయికల్ మాజీ జడ్పీటీసీ అశ్విని జాదవ్ అన్నారు.శుక్రవారం రాయికల్ మండలంలోని తాట్లవాయి గ్రామంలో ఘనంగా నిర్వహించిన తాట్లవాయి ప్రీమియర్ లీగ్ (టిపిఎల్) సీజన్-3 క్రికెట్ పోటీల ముగింపు వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు.ఈ సందర్భంగా అశ్విని జాదవ్ మాట్లాడుతూ.. క్రీడా స్ఫూర్తి కలిగిన వ్యక్తి జీవితంలోని అన్ని రంగాల్లో రాణిస్తారని అన్నారు. నేటి యువత మొబైల్ ఫోన్లు, చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా, క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. క్రీడల వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం దృఢపడటమే కాకుండా, మానవ సంబంధాలు బలపడతాయని, గ్రామాల్లో ఐక్యత పెరుగుతుందని పేర్కొన్నారు.గ్రామీణ ప్రాంత క్రీడాకారుల్లో ఎంతో ప్రతిభ దాగి ఉందని, వారికి తగిన వేదిక, ప్రోత్సాహం అందిస్తే జాతీయ, రాష్ట్ర స్థాయిలో రాణిస్తారని అభిప్రాయపడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహించేందుకు తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని హామీ ఇచ్చారు. అలాగే టిపిఎల్ నిర్వహణకు కప్ లను స్పాన్సర్ చేయడం అభినందనీయమని నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో టిపిఎల్ లీగ్ నిర్వాహకులు, వివిధ జట్ల క్రీడాకారులు, గ్రామ పెద్దలు, యువకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

