జనగామలో పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా కళాబృందం ద్వారా అవగాహన కార్యక్రమం
జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 24(ప్రజావాణి): పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్, జనగామ డీసీపీ రాజా మహేంద్ర నాయక్, ఐపీఎస్ ఆదేశాల మేరకు శనివారం జనగామ పట్టణంలోని ప్రధాన కూడళ్లలో కళాబృందం ద్వారా ప్రత్యేక అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
దేశ రక్షణలో, శాంతిభద్రతల పరిరక్షణలో విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలను, సేవలను స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కళాకారులు ఆకట్టుకునే నాటికలు, దేశభక్తి గీతాలు, బుర్రకథలు, పాటల రూపంలో పోలీసు అమరవీరుల ధైర్యసాహసాలు, అంకితభావం, త్యాగనిరతిని ప్రజలకు కళ్లకు కట్టినట్లు వివరించారు.
పోలీసు ఉద్యోగం అంటే కేవలం ఉద్యోగం కాదు, అది ఒక త్యాగం అని, 24 గంటలు ప్రజల కోసం, సమాజం కోసం పని చేస్తూ ఎంతో మంది పోలీసులు అమరులయ్యారని, వారి కుటుంబాలు పడుతున్న బాధను ప్రజలు అర్థం చేసుకోవాలని కళాకారులు తమ ప్రదర్శన ద్వారా కంటతడి పెట్టించారు.
సమాజానికి పోలీసులు అందిస్తున్న అమూల్యమైన సేవల గురించి, పోలీసు శాఖతో ప్రజలు స్నేహపూర్వకంగా మెలగాలని, నేరాల నియంత్రణలో పోలీసులకు సహకరించాలని ఈ సందర్భంగా అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక పోలీసు సిబ్బంది, ప్రజలు, యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు.

