ఓదెల హైస్కూల్‌కు కబడ్డీ కీర్తి.. రాష్ట్రస్థాయికి ఇద్దరు విద్యార్థులు
కబడ్డీ క్రీడలో ఓదెల విద్యార్థుల సత్తా
రాష్ట్రస్థాయి పోటీలకు ఇద్దరు క్రీడాకారుల ఎంపిక
ఓదెల: క్రీడా రంగంలో ఓదెల ఉన్నత పాఠశాల విద్యార్థులు తమ ప్రతిభను చాటుతున్నారు. పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికై పాఠశాలకు, మండలానికి గర్వకారణంగా నిలిచారు.
పాఠశాలలో చదువుతున్న పేరం అక్షయ సబ్‌జూనియర్ విభాగం కబడ్డీ పోటీలకు, బీరం అరవింద్ జూనియర్ విభాగం కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను ఓదెల సర్పంచ్ కనికి రెడ్డి సతీష్ అభినందించారు. క్రీడల్లో విద్యార్థులు సాధిస్తున్న విజయాలు అభినందనీయమని, ఇదే స్ఫూర్తితో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పద్మ మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించడం అభినందనీయమన్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి భవిష్యత్తులో జాతీయస్థాయిలోనూ మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు.
పాఠశాల పీడీ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఎంపికైన విద్యార్థులు అక్టోబర్ 2, 3, 4, 5 తేదీల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో నిర్వహించే రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. విద్యార్థులు పోటీలకు పూర్తి సన్నద్ధతతో హాజరై ఉత్తమ ప్రతిభ కనబరచాలని సూచించారు.
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినులు అభినందించి, పోటీల్లో విజయాలు సాధించి పాఠశాలకు మరింత పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

