📄 ePaper
Epaper 2
Tuesday, October 13, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriఎదులాబాద్‌లో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు... ఇందిరమ్మ చీరలు ధరించి సంప్రదాయ...

ఎదులాబాద్‌లో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు… ఇందిరమ్మ చీరలు ధరించి సంప్రదాయ ఆటపాటలతో సందడి చేసిన మహిళలు

📰 Generate e-Paper Clip

ఘట్‌కేసర్, అక్టోబర్ 10 (ప్రజావాణి):మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలోని ఎదులాబాద్‌లో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలు, యువతులు అత్యంత ఉత్సాహంగా జరుపుకున్నారు. ఇందిరమ్మ చీరలు ధరించి, రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి సంప్రదాయ గీతాలు ఆలపిస్తూ ఆటపాటలతో సందడి చేశారు.

వివిధ రకాల పూలతో ఆకర్షణీయంగా అలంకరించిన బతుకమ్మలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మహిళలంతా ఒకచోట చేరి బతుకమ్మల చుట్టూ తిరుగుతూ సంప్రదాయ పాటలు పాడారు. కోలాటాలు ఆడుతూ ఆనందోత్సాహాల మధ్య పండుగను జరుపుకున్నారు. ఇందిరమ్మ చీరలు ధరించిన మహిళలు సంప్రదాయబద్ధంగా బతుకమ్మ ఆడుతూ సందడి చేయడంతో ఆ ప్రాంతమంతా పండుగ శోభను సంతరించుకుంది.

ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు చిర్ర బాలరత్నం మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, ప్రకృతితో మమేకమైన జీవన విధానానికి ప్రతీక అని పేర్కొన్నారు. పూలను పూజిస్తూ ప్రకృతిని ఆరాధించడం ఈ పండుగ ప్రత్యేకత అని తెలిపారు. తరతరాలుగా వస్తున్న తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడంతోపాటు వాటి గొప్పతనాన్ని భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

పండుగలు ప్రజల మధ్య ఐక్యతను, పరస్పర అనుబంధాన్ని, సోదరభావాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సంప్రదాయబద్ధంగా వేడుకలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలను భవిష్యత్తులోనూ కొనసాగిస్తూ సమాజంలో ఐకమత్యాన్ని మరింత బలోపేతం చేస్తామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు ముదిరాజ్ సంఘం నాయకులు, కార్యవర్గ సభ్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఈ వేడుకల్లో సంఘం నాయకులు, కార్యవర్గ సభ్యులు, మహిళా సంఘం ప్రతినిధులు, స్థానిక మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వేడుకల్లో పాల్గొన్న వారందరికీ సంఘం అధ్యక్షుడు చిర్ర బాలరత్నం, కార్యవర్గ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.