📄 ePaper
Epaper 2
Tuesday, October 13, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణపంచాయతీ వద్ద బ్లేడ్ ట్రాక్టర్ ఉంది.. కానీ రోడ్డు పక్కన ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలు

పంచాయతీ వద్ద బ్లేడ్ ట్రాక్టర్ ఉంది.. కానీ రోడ్డు పక్కన ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలు

📰 Generate e-Paper Clip

*పంచాయతీ వద్ద బ్లేడ్ ట్రాక్టర్ ఉంది.. కానీ రోడ్డు పక్కన ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలు*

*రాయికల్, అక్టోబర్ 13 (ప్రజావాణి):*

రాయికల్ మండలంలో పరిస్థితి చూస్తే ప్రజలకు ఒకే ఒక సందేహం వస్తోంది. ప్రతి గ్రామ పంచాయతీ వద్ద ప్రభుత్వం లక్షల రూపాయలు వెచ్చించి ఇచ్చిన ట్రాక్టర్, దానికి తోడు రోడ్లు శుభ్రం చేయడానికి ప్రత్యేకంగా బ్లేడు ఉన్నా, మరి రోడ్ల పక్కన ఈ పిచ్చి మొక్కలు ఎందుకు ఇలా 5-6 అడుగుల ఎత్తున పెరిగాయి అని.మండలంలో ఏ గ్రామానికి వెళ్లినా రోడ్డుకు ఇరువైపులా తుమ్మ, జిల్లేడు, ముళ్ల పొదలు మనిషి ఎత్తున ఏపుగా పెరిగి రోడ్డును కబ్జా చేశాయి. దీంతో రోడ్డు వెడల్పు 3-4 అడుగుల మేర తగ్గిపోయింది. రెండు వాహనాలు ఎదురెదురు వస్తే పక్కకు తప్పుకోవడానికి కూడా స్థలం లేకుండా పోయింది. ముఖ్యంగా మలుపుల వద్ద, కల్వర్టుల దగ్గర పిచ్చి మొక్కల కారణంగా ఎదురుగా వచ్చే వాహనం కనిపించక చిన్న చిన్న ప్రమాదాలు నిత్యం జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.ఇక రాత్రి వేళల్లో ఈ పొదల్లో నుండి పాములు, తేళ్లు, ఇతర విషపురుగులు బయటకు వచ్చి రోడ్డుపైకి చేరుతుండటంతో పాదచారులు, తెల్లవారుజామున పొలాలకు వెళ్లే రైతులు, కూలీలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పిల్లలను సైకిళ్లపై బడికి పంపాలంటేనే తల్లిదండ్రులు భయపడే పరిస్థితి నెలకొంది.అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే, ప్రతి పంచాయతీ వద్ద ట్రాక్టర్ తో పాటు బ్లేడు అందుబాటులో ఉండి, దానికి డీజిల్ కు నిధులు కూడా ఉన్నా, నెలల తరబడి ఒక్కసారి కూడా బ్లేడుతో రోడ్ల పక్కన శుభ్రం చేసిన దాఖలాలు లేవు. చాలా గ్రామాల్లో బ్లేడులు పంచాయతీ కార్యాలయం ముందు నిరుపయోగంగా పడి ఉన్నాయి. కార్యదర్శులు, సర్పంచులు పట్టించుకోకపోవడంతోనే ఈ దుస్థితి నెలకొందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కొన్ని గ్రామాల్లో మాత్రం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (VB-G RAM G) కూలీలతో రోడ్లకు ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలను తొలగించి, పూల మొక్కలు నాటి సాసర్లు ఏర్పాటు చేయడంతో ఆ రోడ్లు చూడముచ్చటగా, శుభ్రంగా కనిపిస్తున్నాయి.ఏ గ్రామ ప్రజలు ఆ గ్రామ పొలిమేర వరకు రోడ్ల వెంబడి ఉన్న పిచ్చి మొక్కలను శుభ్రం చేస్తే రోడ్లపై ఎలాంటి ప్రమాదాలు జరగవని, ఇదే స్ఫూర్తితో మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలు తమ వద్ద ఉన్న ట్రాక్టర్ బ్లేడులను, అవసరమైతే జెసిబిలను ఉపయోగించి వారం రోజుల్లో రోడ్లకు ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలను పూర్తిగా తొలగించి ప్రజలకు సురక్షిత ప్రయాణాన్ని అందించాలని మండల ప్రజలు మండల అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.