*ఇందిరమ్మ ఇళ్లు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల మంజూరులో పారదర్శకత – వదంతులను నమ్మవద్దు: మున్సిపల్ కమిషనర్*
జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 30 (ప్రజావాణి):
జనగామ మున్సిపాలిటీ పరిధిలో ఇందిరమ్మ ఇల్లు / డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు మంజూరు విషయంలో ఒక లబ్ధిదారురాలి నుంచి రూ.1,00,000/- డిమాండ్ చేసినట్లు వచ్చిన సమాచారంపై మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ రెడ్డి వెంటనే స్పందించి విచారణ చేపట్టారు.
విచారణలో భాగంగా సంబంధిత లబ్ధిదారురాలిని, మున్సిపల్ సిబ్బందిని విచారించగా, మున్సిపల్ ఉద్యోగులు ఎవరూ తన ఇంటికి రాలేదని, తనను ఎవరూ డబ్బులు అడగలేదని, తాను కూడా ఎవరికీ ఎటువంటి డబ్బులు చెల్లించలేదని లబ్ధిదారురాలు స్పష్టం చేసినట్లు కమిషనర్ తెలిపారు. అయితే ఒక గుర్తుతెలియని వ్యక్తి తన ఇంటికి వచ్చి రూ.1,00,000/- అడిగినట్లు ఆమె తెలిపిందన్నారు.
ప్రాథమిక విచారణలో ఈ ఘటనతో మున్సిపల్ సిబ్బందికి ఎటువంటి సంబంధం లేదని నిర్ధారించబడిందని కమిషనర్ తెలిపారు.
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఐఏఎస్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇళ్లు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక, పంపిణీ ప్రక్రియను ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం అత్యంత పారదర్శకంగా, డ్రా విధానం ద్వారా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
కాబట్టి ప్రజలు ఆధారాలు లేని వదంతులు, తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, ఎవరైనా ఇళ్ల మంజూరు పేరుతో డబ్బులు డిమాండ్ చేసినా లేదా అనుమానాస్పదంగా వ్యవహరించినా సంబంధిత ఆధారాలతో జనగామ మున్సిపల్ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. అటువంటి ఫిర్యాదులపై విచారణ జరిపి, వాస్తవాలు నిర్ధారణ అయిన పక్షంలో నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

