అమ్మపేటకు మహర్దశ.. రూ.6.90 కోట్లతో మూడు రోడ్లు!
ముదిగొండ మండలంలో రూ.10 కోట్లతో నాలుగు బీటీ రోడ్ల అభివృద్ధి.
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చొరవతో నిధుల మంజూరు
ముదిగొండ, అక్టోబర్ 16 ప్రజావాణి
ముదిగొండ మండలంలోని అమ్మపేట గ్రామానికి మహర్దశ పట్టనుంది. గ్రామ ప్రజల రాకపోకల ఇబ్బందులను తొలగించేందుకు ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, విద్యుత్ శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్క చొరవతో మూడు ప్రధాన రహదారుల నిర్మాణానికి రూ.6.90 కోట్ల నిధులు మంజూరయ్యాయి. మొత్తంగా ముదిగొండ మండలంలో నాలుగు బీటీ రోడ్ల అభివృద్ధికి రూ.10 కోట్ల నిధులు కేటాయిస్తూ పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది.
అమ్మపేటకు మూడు రోడ్లు.. రూ.6.90 కోట్లు.
మంజూరైన నిధుల్లో అమ్మపేట గ్రామానికి సంబంధించిన మూడు రహదారులకే అధిక మొత్తంలో నిధులు కేటాయించడం విశేషం. అమ్మపేట నుంచి కమలాపురం రహదారికి రూ.2.30 కోట్లు, వనం వారి కృష్ణాపురం నుంచి అమ్మపేట రహదారికి రూ.3.50 కోట్లు, అమ్మపేట నుంచి ఎలగొండస్వామి దేవాలయానికి వెళ్లే రహదారికి రూ.1.10 కోట్లు మంజూరయ్యాయి. అలాగే మాధాపురం నుంచి సీతారాంపురం రహదారి అభివృద్ధికి రూ.3.20 కోట్లు కేటాయించారు.
నాయకుల విజ్ఞప్తికి స్పందన.
అమ్మపేట గ్రామ కాంగ్రెస్ పార్టీ జోన్ ఇన్చార్జిలు మట్ట బాబు రామ్ రెడ్డి మరియు ఉసికల రమేష్ మరియుమత్కేపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ వడ్డెల్లి వీర రాఘవులు, అమ్మపేట గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు వడ్డెల్లి రామారావు (నాగయ్య) , మరియు ఉప సర్పంచ్ ఊటుకూరి గోపయ్య గ్రామానికి అవసరమైన రహదారుల నిర్మాణంపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఉప ముఖ్యమంత్రి రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరు చేయించడంతో గ్రామస్థుల చిరకాల ఆకాంక్ష నెరవేరే అవకాశం ఏర్పడింది.
ప్రజలకు, భక్తులకు మెరుగైన రవాణా సౌకర్యం.
ఇప్పటికే ముత్తారం, వనం వారి కృష్ణాపురం గ్రామాలకు రెండు రహదారులు మంజూరైన నేపథ్యంలో, తాజాగా వనం వారి కృష్ణాపురం నుంచి అమ్మపేటకు మరో రహదారి మంజూరు కావడంతో స్థానికుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా వేలగొండస్వామి దేవాలయానికి వచ్చే భక్తులకు రవాణా సౌకర్యం మెరుగుపడనుంది. రహదారుల నిర్మాణం పూర్తయితే గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ప్రయాణ ఇబ్బందులు తగ్గడంతోపాటు వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు కూడా ఎంతో ప్రయోజనం కలగనుంది.అమ్మపేటతో పాటు మండలంలోని ఇతర గ్రామాల రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరు చేయించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు వడ్డెల్లి వీర రాఘవులు, వడ్డెల్లి రామారావు, కు జోన్ ఇన్చార్జిలకు గ్రామ నాయకులు, ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

