📄 ePaper
Epaper 2
Sunday, October 18, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణప్రభుత్వ హామీ నీటిమీద రాతలు

ప్రభుత్వ హామీ నీటిమీద రాతలు

📰 Generate e-Paper Clip

*ప్రభుత్వ హామీ నీటిమీద రాతలు – ఆకలి కేకలతో ఫీల్డ్ అసిస్టెంట్ కుటుంబాలు*

*రాయికల్, అక్టోబర్ 16 (ప్రజావాణి):*

ఉపాధి హామీ పథకానికి వెన్నెముకగా నిలుస్తూ గత 20 సంవత్సరాలుగా గ్రామాల్లో ఎండనకా వాననకా శ్రమిస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ల బతుకులు దినదినగండంగా మారుతున్నాయి. పథకం పేరు వీబీ-జీ రామ్ జీ గా మారినా, వారి తలరాతలు మాత్రం మారలేదనే ఆవేదన వ్యక్తమవుతోంది. ప్రతిరోజూ వేకువజామునే లేచి ఇంటింటికి తిరిగి కూలీలను మోటివేట్ చేసి పనులు కల్పించడం, మండుటెండలో కొలతలు వేయడం, మస్టర్ రోల్స్ నిర్వహించడం, జియో ట్యాగింగ్, ఆన్ లైన్ ఎంట్రీలతో రాత్రి వరకు నిద్రలేకుండా పనిచేస్తున్నా, వారికి వస్తున్న వేతనం చాలీచాలనిదిగా ఉంది. ఈ అరకొర జీతంతో కుటుంబ పోషణ భారంగా మారింది. నిత్యవసర వస్తువుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో పిల్లల ఫీజులు కట్టలేక, ఇంటి అద్దెలు చెల్లించలేక అనేక కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. దీంతో చాలామంది ఫీల్డ్ అసిస్టెంట్లు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని తమ మేనిఫెస్టోలో స్పష్టంగా పొందుపరిచింది. అయితే అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు ఆ హామీని నెరవేర్చలేదు. ఈ విషయంపై పలుమార్లు శాఖ మంత్రి సీతక్కను కలిసి వినతి పత్రాలు అందజేస్తే, సానుకూలంగా ఉన్నాం, త్వరలోనే శుభవార్త చెబుతాం అంటూ కాలయాపన చేస్తున్నారే తప్ప, క్షేత్రస్థాయిలో ఫీల్డ్ అసిస్టెంట్ల గురించి పట్టించుకున్న పాపాన పోలేదని వాపోతున్నారు. ఒకవైపు కూలీలు లేకపోతే మండల అధికారుల నుండి ఒత్తిడి, మరోవైపు పనుల నాణ్యత విషయంలో ఉన్నతాధికారుల నుండి మెమోలు, టార్గెట్ల పేరుతో వేధింపులు ఇలా మధ్యలో నలిగిపోతున్నది ఫీల్డ్ అసిస్టెంట్లే. 25 సంవత్సరాల వయసులో ఈ ఉద్యోగంలో చేరిన ఫీల్డ్ అసిస్టెంట్లు, నేడు వయసు మీరిపోవడంతో ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా కోల్పోయారు. విద్యార్హతలు ఉన్నా వయోపరిమితి అడ్డంకిగా మారి, ఉన్న ఉద్యోగానికే పరిమితం కావాల్సిన దుస్థితి నెలకొంది. కాబట్టి ఇకనైనా ప్రభుత్వం ఆలోచించి, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, ఫీల్డ్ అసిస్టెంట్ల కనీస వేతనాన్ని రూ.25 వేలకు పెంచి, ఉద్యోగ భద్రత కల్పించి న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.