*అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల సమస్యలు పరిష్కరించాలి*
మూడేళ్లు గడిచినా అమలుకాని కాంగ్రెస్ హామీలు
కనీస వేతనం రూ.30 వేలు ఇవ్వాలి: సీఐటీయూ
ప్రజావాణి భద్రాద్రి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 30
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తవుతున్నప్పటికీ అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదని, వారి ఉద్యోగ భద్రతపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల అర్జున్ విమర్శించారు. శుక్రవారం కొత్త నారంవారిగూడెంలో నిర్వహించిన అంగన్వాడీ టీచర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు పౌష్టికాహారం, చిన్నారులకు ఆరోగ్య సేవలు అందిస్తూ నిరంతరం ప్రజలకు సేవలందిస్తున్న అంగన్వాడీ సిబ్బందికి తగిన గుర్తింపు, కనీస వేతనాలు కల్పించడంలో పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు.
*పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలి*
నిత్యావసర వస్తువులు, వైద్యం, ఇంధన ధరలు విపరీతంగా పెరిగినప్పటికీ అందుకు అనుగుణంగా అంగన్వాడీ సిబ్బంది వేతనాలు పెరగకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అర్జున్ పేర్కొన్నారు.
*ఐసీడీఎస్ నిధుల్లో కోతతో ఇబ్బందులు*
కేంద్ర ప్రభుత్వం ఐసీడీఎస్‌కు కేటాయిస్తున్న నిధుల్లో 60 శాతం కోత విధించిందని, దీంతో ఐసీడీఎస్ వ్యవస్థతో పాటు అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ భారంగా మారే పరిస్థితి ఏర్పడుతోందని అన్నారు.
*రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలి*
పదవీ విరమణ చేసిన అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ నేటికీ అమలు చేయలేదని విమర్శించారు. పెండింగ్‌లో ఉన్న ప్రయోజనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
*రూ.30 వేల కనీస వేతనం కల్పించాలి*
అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు కనీస వేతనం రూ.30 వేలు చెల్లించాలని, పీఆర్సీ, డీఏలు వర్తింపజేయాలని పిట్టల అర్జున్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వారి సమస్యలను పరిష్కరించి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.ఈ సమావేశంలో కృష్ణవేణి, సుజాత, ఉష తదితరులు పాల్గొన్నారు.

