బొడుప్పల్, సెప్టెంబర్ 13 (ప్రజావాణి): పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణపతి విగ్రహాలను పూజించాలని భక్తులకు అవగాహన కల్పిస్తూ శ్రీ మాత నిమిషాంబికా దేవి ట్రస్ట్ ఆధ్వర్యంలో 500 మట్టి గణపతి విగ్రహాలను ఆదివారం భక్తులకు ఉచితంగా పంపిణీ చేశారు. హెచ్ఎండీఏ సహకారంతో శ్రీ హంపీ విరూపాక్ష విద్యారణ్య మహా సంస్థానం, హంపి పీఠం, నకాష్ సంఘం సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టర్ ఆఫ్ పారిస్, రసాయన రంగులతో తయారు చేసిన విగ్రహాలకు బదులుగా మట్టి విగ్రహాలను వినియోగించడం ద్వారా ప్రకృతి పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని నిర్వాహకులు సూచించారు. మట్టి విగ్రహాలతో పూజలు నిర్వహించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని భక్తులకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కామరౌతు వినోద్‌కుమార్, ప్రధాన కార్యదర్శులు కె.అశోక్‌కుమార్, సంగు శ్రీనివాస్, రాష్ట్ర నకాష్ సంఘం ప్రధాన కార్యదర్శి కొరిచెర్ల శ్రీనివాస్‌రావు, పెంటారెడ్డి కాలనీ అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, పురోహితులు చంద్రశేఖర్శర్మతో పాటు ఆలయ ట్రస్ట్, సంఘం సభ్యులు పాల్గొన్నారు.

