మెదక్ జిల్లా ఎస్టీ మోర్చా కమిటీపై రాష్ట్ర అధ్యక్షుడికి వినతి
హైదరాబాద్, సెప్టెంబర్ 12: భారతీయ జనతా పార్టీ ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17 నుంచి ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న “సేవా సంకల్ప అభియాన్” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు నేనావత్ రవి నాయక్ అధ్యక్షతన రాష్ట్ర పదాధికారుల సమావేశం, సేవా సంకల్ప అభియాన్‌పై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర సంఘటన మంత్రి చంద్రశేఖర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎస్టీ మోర్చా ప్రభారీ వేముల అశోక్, రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ కల్యాణ్ నాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరేందర్ గౌడ్‌తో పాటు పలువురు ముఖ్య నాయకులు హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, గిరిజన ప్రాంతాల్లో పార్టీని మరింత బలోపేతం చేయడం, ప్రజా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయడం వంటి అంశాలపై నాయకులు చర్చించారు.
ఈ సందర్భంగా బీజేపీ మెదక్ జిల్లా ఎస్టీ మోర్చా అధ్యక్షులు రాము నాయక్ ఆధ్వర్యంలో జిల్లా కమిటీని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడంతో పాటు, జిల్లాలోని ప్రతి మండలానికి ఎస్టీ మోర్చా మండల అధ్యక్షులను నియమించినట్లు రాష్ట్ర అధ్యక్షులు నేనావత్ రవి నాయక్‌కు వివరించారు. మండల స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయడం ద్వారా పార్టీ కార్యక్రమాలను గిరిజన గ్రామాలు, తండాల స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.
జిల్లా ఎస్టీ మోర్చా కమిటీ పూర్తి కావడం, మండల అధ్యక్షుల నియామకం వంటి విషయాలను రాష్ట్ర అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, ఆయా అంశాలపై మండల అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు రవి నాయక్‌కు వినతిపత్రం అందజేశారు. గిరిజనుల సమస్యలు, సంక్షేమ పథకాలు, విద్య, ఉపాధి, రహదారులు, తాగునీరు తదితర అంశాలపై గ్రామస్థాయిలో ప్రజలతో మమేకమై పనిచేయాలని ఈ సందర్భంగా నాయకులు సూచించారు.
మెదక్ జిల్లాలో ఎస్టీ మోర్చాను మరింత బలోపేతం చేసి, ప్రతి మండలంలో పార్టీ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు నాయకులు తెలిపారు. రాబోయే రోజుల్లో గిరిజన ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, ప్రజా సమస్యల పరిష్కారానికి ఎస్టీ మోర్చా నాయకులు నిరంతరం అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా ఎస్టీ మోర్చా ప్రధాన కార్యదర్శులు ముడావత్ కుమార్ నాయక్, ఫుల్ సింగ్ నాయక్‌తో పాటు మండల అధ్యక్షులు, ఎస్టీ మోర్చా నాయకులు, రాష్ట్ర పదాధికారులు తదితరులు పాల్గొన్నారు.
మెదక్ జిల్లా ఎస్టీ మోర్చా కమిటీపై రాష్ట్ర అధ్యక్షుడికి వినతి
RELATED ARTICLES

