*ఎల్-నినోను ఎదుర్కొనేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు*
తేమ ఒత్తిడిలో ఉన్న ప్రతి పంటను కాపాడాలి.. అందుబాటులో ఉన్న ప్రతి నీటి వనరునూ వినియోగించాలి
– రైతులకు అండగా ప్రభుత్వం.. క్షేత్రస్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి
– 284 మండలాల్లో పంటల పరిస్థితిపై నిరంతర పర్యవేక్షణ
– 2.44 లక్షల హెక్టార్లలో పంటలపై ప్రభావం.. రక్షణ చర్యలపై ప్రత్యేక దృష్టి
– పంట ఆరోగ్య వివరాల నమోదులో పెండింగ్‌ను వేగంగా పూర్తి చేయాలి
– ప్రత్యామ్నాయ, తక్కువ నీటి అవసరమయ్యే పంటలను పెద్దఎత్తున ప్రోత్సహించాలి
అమరావతి, సెప్టెంబర్ 13 ప్రజావాణి రాష్ట్రంలో ఎల్-నినో ప్రభావంతో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొని, తేమ ఒత్తిడికి గురవుతున్న పంటలను కాపాడేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎల్-నినో పరిస్థితులు, వర్షపాతం, ఖరీఫ్ సాగు, పంటలపై ప్రభావం, పంట ఆరోగ్య పరిస్థితి, ప్రత్యామ్నాయ పంటల సాగు, అందుబాటులో ఉన్న నీటి వనరులతో పంటలను కాపాడేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఆదివారం మంత్రి అచ్చెన్నాయుడు అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితుల్లో రైతులు నష్టపోకుండా ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. తేమ ఒత్తిడికి గురైన ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న ప్రతి నీటి వనరునూ సద్వినియోగం చేసుకుని పంటలను కాపాడేందుకు రక్షక తడులు అందించాలని వ్యవసాయ, జలవనరుల శాఖల అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ, అవసరమైన చోట తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించారు.రాష్ట్రంలో జూన్ 1 నుంచి సెప్టెంబర్ 12 వరకు సాధారణంగా 476.1 మి.మీ. వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 218.2 మి.మీ. మాత్రమే నమోదైందని అధికారులు మంత్రికి వివరించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 54.2 శాతం వర్షపాతం లోటు నమోదైందన్నారు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వర్షాభావ ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి సూచించారు.ఖరీఫ్-2026లో సెప్టెంబర్ 12 నాటికి రాష్ట్రవ్యాప్తంగా 26.50 లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యాయని అధికారులు తెలిపారు. ఇది సాధారణ సాగు విస్తీర్ణంలో 74 శాతం కాగా, గత ఏడాది ఇదే తేదీ నాటి సాగుతో పోలిస్తే 78 శాతంగా ఉందన్నారు. ప్రధాన పంటల్లో వరి 12.01 లక్షల హెక్టార్లు, పత్తి 4.11 లక్షల హెక్టార్లు, కంది 2.63 లక్షల హెక్టార్లు, వేరుశనగ 1.47 లక్షల హెక్టార్లు, మొక్కజొన్న 1.08 లక్షల హెక్టార్లలో సాగైనట్లు వివరించారు.ఎల్-నినో ప్రభావంతో రాష్ట్రంలోని 284 మండలాలు, 1,792 ఆర్‌ఎస్‌కేలు/గ్రామాల పరిధిలో పంటలపై ప్రభావం నమోదైనట్లు సమావేశంలో అధికారులు వెల్లడించారు. మొత్తం 2,44,443 హెక్టార్లలో పంటలు వివిధ స్థాయుల్లో ప్రభావితమైనట్లు తెలిపారు. ఇందులో 1,92,387 హెక్టార్లలో తేమ ఒత్తిడి, 41,474 హెక్టార్లలో పంటలు వాడిపోవడం, మరో 10,582 హెక్టార్లలో పంటలు ఎండిపోవడం నమోదైనట్లు వివరించారు.ఈ పరిస్థితిపై మంత్రి అచ్చెన్నాయుడు స్పందిస్తూ తేమ ఒత్తిడిలో ఉన్న పంటలను సాధ్యమైనంత వరకు కాపాడటమే ప్రస్తుతం అత్యంత ప్రాధాన్యమని స్పష్టం చేశారు. రైతులకు అవసరమైన సాంకేతిక సూచనలు ఎప్పటికప్పుడు అందించాలని, అధికారులు కార్యాలయాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు. జిల్లాల వారీగా కర్నూలు జిల్లాలో అత్యధికంగా 1,09,255 హెక్టార్లు, నంద్యాల జిల్లాలో 80,751 హెక్టార్లు, అనంతపురం జిల్లాలో 32,456 హెక్టార్లలో పంటలు ప్రభావితమైనట్లు అధికారులు తెలిపారు. ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాల్లో వ్యవసాయ, జలవనరుల శాఖల అధికారులు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్లాలని మంత్రి ఆదేశించారు. పంటల వారీగా కంది 74,301 హెక్టార్లు, పత్తి 73,733 హెక్టార్లు, వేరుశనగ 25,818 హెక్టార్లు, మొక్కజొన్న 24,819 హెక్టార్లు, వరి 18,443 హెక్టార్లలో ప్రభావితమైనట్లు సమావేశంలో వివరించారు. ఈ-పంట,ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2.7558 కోట్ల ప్లాట్లలో 2.7493 కోట్ల ప్లాట్ల సర్వే పూర్తయిందని,తద్వారా 99.76 శాతం సర్వే పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. కేవలం 65,233 ప్లాట్లు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. మిగిలిన సర్వేను కూడా త్వరితగతిన పూర్తి చేసి క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులను నమోదు చేయాలని మంత్రి ఆదేశించారు. పంట ఆరోగ్య వివరాలకు సంబంధించి 1.082 కోట్ల ప్లాట్లలో వివరాలు నవీకరించాల్సి ఉండగా,ఇప్పటివరకు 98.10 లక్షల ప్లాట్లలో నవీకరణ పూర్తయిందని అధికారులు వివరించారు.ఇంకా 10.10 లక్షల ప్లాట్లు, అంటే 9.34 శాతం పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపారు.దీనిపై మంత్రి అచ్చెన్నాయుడు స్పందిస్తూ పంట ఆరోగ్య వివరాల నమోదు కేవలం గణాంకాల కోసం కాకుండా,ఏ ప్రాంతంలో ఏ పంటకు ఎలాంటి సమస్య ఉందో గుర్తించి సకాలంలో రైతుకు సహాయం అందించేందుకు అత్యంత కీలకమన్నారు. ప్రతి ప్లాట్‌లో పంట ఆరోగ్యాన్ని పర్యవేక్షించి, పెండింగ్‌లో ఉన్న వివరాల నవీకరణను వేగంగా పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పంటల వైవిధ్యీకరణపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి సూచించారు. ఇప్పటివరకు 34,567 హెక్టార్లలో ప్రత్యామ్నాయ పంటలు చేపట్టినట్లు అధికారులు వివరించగా, ఇంకా 95,112 హెక్టార్లను కవర్ చేయాల్సి ఉందన్నారు. తక్కువ నీటి అవసరమయ్యే,ప్రస్తుత వాతావరణ పరిస్థితులను తట్టుకునే పంటలను గుర్తించి రైతులను ప్రోత్సహించాలని మంత్రి ఆదేశించారు. రైతులకు విత్తనాలు, సాంకేతిక సలహాలు సహా అవసరమైన సహకారం అందుబాటులో ఉంచాలని సూచించారు.తేమ ఒత్తిడికి గురైన పంటలకు అందుబాటులో ఉన్న నీటి వనరులను వినియోగించి రక్షక తడులు అందించడంపై వ్యవసాయ, జలవనరుల శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. ఏ ప్రాంతంలో పంటకు నీరు అత్యవసరమో గుర్తించాలి. అందుబాటులో ఉన్న నీటిని ప్రాధాన్యతా క్రమంలో వినియోగించాలి.సాధ్యమైన ప్రతి పంటను కాపాడాలి. రైతుకు ప్రభుత్వం అండగా ఉందనే భరోసా క్షేత్రస్థాయిలో కనిపించాలి అని మంత్రి స్పష్టం చేశారు.నాగార్జునసాగర్, శ్రీశైలం జలాశయాల కింద సాగు చేసే రైతులు వరికాకుండా ఆరుతడి పంటలను పండించాలని నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. ఎల్-నినో పరిస్థితులను ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందని, పరిస్థితులకు అనుగుణంగా కార్యాచరణను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ రైతుల ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యంగా ముందుకు సాగాలని అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు దిశానిర్దేశం చేశారు.ఈ ఉన్నతస్థాయి సమీక్షలో నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, వ్యవసాయ–సహకార శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ బి.రాజశేఖర్, ఉద్యానవన శాఖ డైరెక్టర్ శ్రీనివాసులు, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ రాజుని కుమారి, మత్స్య శాఖ కమిషనర్ రామ శంకర్ నాయక్, జలవనరుల శాఖ ఇంజనీర్-ఇన్-చీఫ్, జలవనరుల శాఖ కార్యదర్శి, ఐఏఎస్ రాజమౌళి, వ్యవసాయ, జలవనరుల శాఖలకు చెందిన వివిధ విభాగాధిపతులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

