• కోదాడలో ఘోరం: చికిత్సకు వచ్చిన మహిళపై డాక్టర్ దాడి.. మెట్లపై నుంచి కిందకు తోసేసిన వైనం..
• లంచ్ టైమ్‌లో వచ్చావంటూ మహిళపై వైద్యుడి అరాచకం.. కోదాడ సైదా ఆస్పత్రిలో ఉద్రిక్తత..
కోదాడ, సెప్టెంబర్ 29/ ప్రజావాణి
చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రికి వచ్చిన ఒక మహిళా రోగిపై వైద్యుడు ఆగ్రహంతో విచక్షణారహితంగా దాడి చేసి, మెట్లపై నుంచి కిందకు తోసేసిన ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో కలకలం రేపింది. ఈ ఘటనలో సదరు మహిళకు తల, కాలికి తీవ్ర గాయాలయ్యాయి.
లంచ్ సమయం కావడమే వివాదానికి కారణం!
బాధితురాలి కుటుంబ సభ్యులు మరియు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ పరిధికి చెందిన ఒక మహిళ అనారోగ్య కారణాల వల్ల వైద్య పరీక్షల నిమిత్తం పట్టణంలోని ‘సైదా ఆసుపత్రి’కి వెళ్ళింది. అయితే ఆమె ఆసుపత్రికి చేరుకునే సరికి మధ్యాహ్నం భోజన సమయం అయింది. అత్యవసరంగా చికిత్స అందించాలని రోగి తరఫు వారు కోరగా.. లంచ్ సమయంలో ఎందుకు వచ్చారంటూ అక్కడి వైద్యుడు డాక్టర్ సైదానాయక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. మాట మాట పెరగడంతో విచక్షణ కోల్పోయిన వైద్యుడు సదరు మహిళపై చేయి చేసుకుని, ఆసుపత్రి మెట్లపై నుంచి కిందకు తోసేశారు.
స్పృహతప్పిన బాధితురాలు.. పోలీసుల దర్యాప్తు:
మెట్లపై నుంచి దొర్లి కిందపడటంతో బాధితురాలి తలకు బలమైన గాయమై తీవ్ర రక్తస్రావమైంది. కాలు కూడా విరగడంతో ఆమె అక్కడికక్కడే అపస్మారక స్థితి (స్పృహతప్పి) లోకి వెళ్ళిపోయింది. వైద్యుడి దారుణ ప్రవర్తనతో దిగ్భ్రాంతికి గురైన కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రి ఎదుట బైఠాయించి పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. బాధ్యతారహితంగా వ్యవహరించిన వైద్యుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న కోదాడ పట్టణ పోలీసులు నిరసనకారులను శాంతింపజేశారు. బాధితుల నుంచి వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు జరుపుతున్నట్లు పట్టణ పోలీసులు స్పష్టం చేశారు.

