ప్రతి బొట్టు ప్రజల కోసమే..ఇంటింటికీ శుద్ధ జలాన్ని అందించడమే ‘భగీరథ’ లక్ష్యం
పాత ముగ్ధుంపురంలో మిషన్ భగీరథ సమీక్షా సమావేశం
8 రిజిస్టర్ల నిర్వహణతో సమస్యలకు తక్షణ పరిష్కారం:ఏఈ ప్రభావతి
చెన్నారావుపేట సెప్టెంబర్ 29 ప్రజావాణి
గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడికి శాశ్వత పరిష్కారం చూపుతూ, ప్రతి కుటుంబానికి రక్షిత మంచి నీటిని అందించడమే మిషన్ భగీరథ పథకం యొక్క మూల ఉద్దేశమని ఏఈ ప్రభావతి తెలిపారు.పాత ముగ్ధుంపురంలో గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో మంగళవారం నీటి సరఫరా, నిర్వహణపై ప్రత్యేక అవగాహన సమావేశం జరిగింది.ఈ సందర్భంగా ఏఈ ప్రభావతి మాట్లాడుతూ.. శుద్ధి చేసిన సురక్షిత నీటిని తాగడం ద్వారా అనేక రకాల సీజనల్, నీటి ద్వారా వచ్చే వ్యాధులను అరికట్టవచ్చని పేర్కొన్నారు. పథకం విజయవంతం కావాలంటే క్షేత్రస్థాయిలో పక్కా పర్యవేక్షణ ఉండాలని సూచించారు.పంచాయతీ స్థాయిలో మిషన్ భగీరథకు సంబంధించిన 8 రకాల రిజిస్టర్లను తప్పనిసరిగా పక్కాగా నిర్వహించాలని ఆదేశించారు. నీటి విడుదల సమయాలు, పైప్లైన్ లీకేజీలు, మోటార్ల పనితీరు, క్లోరినేషన్ వివరాలను ఎప్పటికప్పుడు ఈ రిజిస్టర్లలో నమోదు చేయడం ద్వారా సరఫరాలో ఎదురయ్యే సాంకేతిక లోపాలను ప్రాథమిక దశలోనే గుర్తించి పరిష్కరించవచ్చని వివరించారు. ఎక్కడైనా తాగునీటి సరఫరాకు ఆటంకం ఏర్పడితే గ్రామస్థులు వెంటనే పంచాయతీ కార్యదర్శి లేదా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ ననుమాస కరుణాకర్, ఉప సర్పంచ్ అలవాల శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి శ్రావణకుమారి, వార్డు సభ్యులు కొయ్యల స్వప్న, నాంపల్లి సంపత్, కట్టూరి లక్ష్మణాచారి, ధోనికెల రాజమత, జన్ను రమేష్, పఠాన్ హసీనా, ఇతర ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

