*అధికారం కోల్పోయామనే అక్కసుతోనే బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తుంది*
*ఎమ్మెల్యే కడియం శ్రీహరి*
*జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 19 (ప్రజావాణి):*
బీఆర్ఎస్ నాయకులు, కల్వకుంట్ల కుటుంబం ఏ రకంగా పేదల భూములను ఆక్రమించుకున్నారో అసెంబ్లీ సాక్షిగా సీఎం తెలిపారని, తెలంగాణ పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చిన కల్వకుంట్ల కుటుంబం వందల ఎకరాలు సంపాదించుకున్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు.
జిల్లాలోని రఘునాథపల్లి మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల కార్యక్రమానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి శనివారం ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
అంతకు ముందు మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన కల్యాణలక్ష్మి-షాదీ ముబారక్, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. రఘునాథపల్లి మండలానికి సంబంధించిన 24 మంది కల్యాణ లక్ష్మి లబ్ధిదారులకు రూ.24,02,784 విలువగల చెక్కులను మరియు 35 మంది ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు రూ.18,25,500 విలువగల చెక్కులను పంపిణీ చేశారు.

అనంతరం రఘునాథపల్లి మండల కేంద్రంలో రూ.33 లక్షలతో నిర్మించనున్న ఆహార ధాన్యపు గోదాం, రూ.10 లక్షలతో నిర్మించనున్న ఎస్సీ కమ్యూనిటీ హాల్, రూ.10 లక్షలతో నిర్మించనున్న కుర్మ కమ్యూనిటీ హాల్ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అలాగే రూ.10 లక్షలతో నిర్మించిన వివో భవనం, రూ.10 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లతో పాటు గ్రామంలో నూతనంగా నిర్మించిన పలు ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ…
“తెలంగాణ పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చిన కల్వకుంట్ల కుటుంబం 10 ఏళ్లలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని వందల ఎకరాల భూమిని ఆక్రమించుకున్నారు. బీఆర్ఎస్ నాయకులు ధరణిని అడ్డం పెట్టుకొని ఏ రకంగా పేదల భూములను ఆక్రమించుకున్నారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా వివరాలతో సహా వెల్లడించారు.
2014 ఎన్నికల అఫిడవిట్ లో ఒక్క ఎకరం కూడా లేదని చెప్పి 2024 వచ్చేసరికి వందల ఎకరాలు ఎలా వచ్చాయి? 2014కు ముందు మీ ఆస్తులు ఎన్ని? ఇప్పుడు మీ ఆస్తులు ఎన్ని? నిజంగా మీరు నీతిమంతులే అయితే ఆస్తులు ఎలా వచ్చాయో తెలంగాణ ప్రజలకు చెప్పి నిజాయితీ నిరూపించుకోవాలి. ఆ ఆస్తులు ఏ రకంగా వచ్చాయో చెప్పకుండా ఎదురు దాడి చేస్తున్నారు.”
“స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో మునుపెన్నడూ లేని విధంగా రూ.1600 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతుంటే కొంతమందికి కళ్ళకు కనిపించడం లేదు. 15 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఏం చేశాడో ప్రజలు ఆలోచించాలి. 100 పడకల ఆసుపత్రి, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, ఇంటిగ్రేటెడ్ రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ కాంప్లెక్స్, కాలువల మరమ్మత్తులతో ప్రతీ గ్రామానికి చేరుతున్న గోదావరి జలాలతో నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్లు, సీసీ రోడ్లు, వివో భవనాలు, కమ్యూనిటీ హాళ్లు, గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాలు జరుగుతున్నాయి.”
“నియోజకవర్గంలోని అర్హులైన ప్రతీ పేద కుటుంబానికి అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందించడమే నా లక్ష్యం. అభివృద్ధి, సంక్షేమ పథకాల కోసం ఎవరికీ ఒక్క రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. అలా ఎవరైనా అడిగితే నా దృష్టికి తీసుకురావాలి.”
“ఎల్ నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ నియోజకవర్గంలో వానాకాలం పంటలకు సరిపడే నీళ్లు రిజర్వాయర్లలో ఉన్నాయి. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వారం రోజులలో కాలువల ద్వారా సాగు నీరు విడుదల చేస్తాం.” అని తెలిపారు.
రఘునాథపల్లి గ్రామంలో తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన ఈ 3 ఏళ్లలో రూ.3 కోట్ల 50 లక్షల అభివృద్ధి పనులకు మంజూరు ఇచ్చానని, గ్రామానికి 50 ఇందిరమ్మ ఇండ్లతో పాటు సీసీ రోడ్లు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి కోటి రూపాయలు మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు లింగాల జగదీష్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గాదె మహేందర్ రెడ్డి, తహసీల్దార్, ఎంపీడీవో, వివిధ శాఖల అధికారులు, జిల్లా, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు, మహిళలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

