📄 ePaper
Epaper 2
Saturday, September 19, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణJangaonరత్న తండాకు రోడ్డు సౌకర్యం కల్పించాలి

రత్న తండాకు రోడ్డు సౌకర్యం కల్పించాలి

📰 Generate e-Paper Clip

*రత్న తండాకు రోడ్డు సౌకర్యం కల్పించాలి*
*2 కిలోమీటర్ల రహదారి లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు*
*సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి రాజు*

జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 19(ప్రజావాణి): జిల్లా లోని చిల్పూర్ మండలం లింగంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని రత్న తండాకు తక్షణమే రోడ్డు సౌకర్యం కల్పించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సిపిఎం బృందం రత్న తండాను సందర్శించి అక్కడి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంది. సుమారు 80 సంవత్సరాల క్రితం రత్న నాయక్ ద్వారా ఏర్పడిన ఈ తండాలో ప్రస్తుతం 13 కుటుంబాలకు చెందిన సుమారు 60 మంది నివసిస్తున్నారని, వీరంతా ప్రధానంగా రోజువారీ కూలీ పనులపై ఆధారపడి జీవిస్తున్నారని స్థానికులు తెలిపారు. ఒక్కో కుటుంబానికి సుమారు ఎకరం నుంచి రెండు ఎకరాల వరకు మాత్రమే భూమి ఉందని వివరించారు.

*రోడ్డు లేక విద్య, వైద్యం కూడా దూరమే:*
రత్న తండాకు సుమారు 2 కిలోమీటర్ల మేర సరైన రహదారి సౌకర్యం లేకపోవడం ప్రజల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తోందని రాపర్తి రాజు అన్నారు. రహదారి లేకపోవడంతో పిల్లలను పాఠశాలకు, అంగన్‌వాడీ కేంద్రానికి పంపించడం కష్టంగా మారిందని, అత్యవసర సమయంలో వైద్య సేవలు పొందేందుకు కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కేవలం ఒక కిలోమీటరు దూరంలో ఉన్న దేవోజీతండాకు వెళ్లేందుకు కూడా రోడ్డు సమస్య అడ్డంకిగా మారడం దురదృష్టకరమన్నారు.

*కనీస సౌకర్యాలు కూడా లేవు:*
సుమారు 60 మంది నివసిస్తున్న రత్న తండాలో రేషన్ షాపు, అంగన్‌వాడీ కేంద్రం వంటి కనీస సౌకర్యాలు కూడా లేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు. ఆరోగ్య సేవలు అందించాల్సిన ఆశా, ఆరోగ్య కార్యకర్తలు కూడా క్రమం తప్పకుండా అందుబాటులో ఉండటం లేదని, ఆరు నెలలకు ఒకసారి మాత్రమే వస్తున్నారని ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు.

రత్న తండా ప్రజలు కూడా ఈ రాష్ట్ర పౌరులేనని, వారికి రోడ్డు, విద్య, వైద్యం, ఆహార భద్రత వంటి కనీస మౌలిక సదుపాయాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు.

ప్రభుత్వం వెంటనే రత్న తండాకు అవసరమైన 2 కిలోమీటర్ల రహదారిని నిర్మించాలని, రేషన్ షాపు, అంగన్‌వాడీ కేంద్రం ఏర్పాటు చేయాలని, క్రమం తప్పకుండా ఆరోగ్య సేవలు అందించాలని, అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

అధికారులు రత్న తండాను ప్రత్యక్షంగా సందర్శించి సమస్యలను పరిశీలించి, కాలపరిమితితో పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. రత్న తండా ప్రజల సమస్యల పరిష్కారం కోసం సిపిఎం ప్రజలతో కలిసి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి అవసరమైతే ప్రజా ఉద్యమాన్ని చేపడుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి సాదం రమేష్, లింగంపల్లి గ్రామ శాఖ కార్యదర్శి ఆవుల ప్రభాకర్, మండల కమిటీ సభ్యులు అపారదాపు రాజు, రైతు సంఘం మండల కార్యదర్శి పురమాని శ్రవణ్, మండల అధ్యక్షులు ఊరడి లింగయ్య, నాయకులు కర్రె నాగరాజు, అపారదాపు రవీందర్, బానోత్ గణేష్, బానోత్ రాజేందర్, బానోత్ బిచ్చ, బానోత్ బల్లు, బానోత్ సుగుణ, బానోత్ రాజమ్మ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.