అంగన్వాడీలకు కేంద్ర ప్రభుత్వ అండదండలు పుష్కలం బిజెపి అధ్యక్షురాలు జల్లి శైలజ హరినాథ్

సేవా సంకల్ప అభియాన్లో భాగంగా అత్వెల్లి అంగన్వాడీ కేంద్రం సందర్శన, సిబ్బందికి ఘన సన్మానం
మేడ్చల్,: మహిళలు, గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యం, పోషణకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేస్తోందని మేడ్చల్ మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షురాలు జల్లి శైలజ హరినాథ్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధికి పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు.
దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్’లో భాగంగా సేవా పఖ్వాడా కార్యక్రమంలో నిర్వహిస్తున్న ‘అంగన్ మిలన్ సేవలో భాగంగా సోమవారం మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని అత్వెల్లి అంగన్వాడీ కేంద్రాన్ని జల్లి శైలజ హరినాథ్ స్థానిక బీజేపీ నాయకులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రంలో అందుతున్న సేవలు, కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరును పరిశీలించారు.
*కేంద్ర పథకాలతో పోషకాహారానికి ప్రాధాన్యం*
అనంతరం అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో జల్లి శైలజ హరినాథ్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘పోషణ్ అభియాన్’ (పోషణ్ 2.0) ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారాన్ని అందిస్తూ చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.
‘సక్షమ్ అంగన్వాడీ’ పథకం ద్వారా అంగన్వాడీ కేంద్రాల్లో తాగునీరు, పారిశుధ్యం, స్మార్ట్ పరికరాలు వంటి మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తూ ఆధునీకరణకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ‘ప్రధానమంత్రి మాతృ వందన యోజన’ ద్వారా అర్హులైన గర్భిణులు, బాలింతలకు ఆర్థిక సహాయం అందిస్తూ కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తోందని పేర్కొన్నారు.
*అంగన్వాడీ సమస్యలు తెలుసుకున్న బిజెపి నాయకులు*
ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహార పంపిణీ తీరును పరిశీలించిన జల్లి శైలజ హరినాథ్, కేంద్రంలో నెలకొన్న మౌలిక సదుపాయాల సమస్యలు, ఇతర ఇబ్బందులపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కేంద్రంలో గుర్తించిన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు సేవలందించడంలో అంకితభావంతో పనిచేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు, ఆయా సిబ్బందిని అభినందించారు. ఈ సందర్భంగా వారికి శాలువాలు కప్పి ఘనంగా సన్మానించి, వారి సేవలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ రూరల్ జిల్లా బీజేపీ కోశాధికారి లవంగ శ్రీకాంత్, మేడ్చల్ రూరల్ జిల్లా మహిళా మోర్చా అధికార ప్రతినిధి కృష్ణప్రియ మల్లారెడ్డి, మేడ్చల్ మహిళా మోర్చా నాయకురాలు తోట అనిత, నాయకులు మహేష్ గౌలికర్, జకట బాబు రాజు తదితరులు పాల్గొన్నారు.

