📄 ePaper
Epaper 2
Monday, September 28, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్ప్రజా సమస్యలపై కౌన్సిలర్ యెరికల్ రెడ్డి పోరాటం: ఖాళీ బిందెలతో అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ ఎదుట...

ప్రజా సమస్యలపై కౌన్సిలర్ యెరికల్ రెడ్డి పోరాటం: ఖాళీ బిందెలతో అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ ఎదుట ధర్నా.. దిగివచ్చిన యాజమాన్యం!

📰 Generate e-Paper Clip

వైఎస్ఆర్ జిల్లా యర్రగుంట్ల సెప్టెంబర్ 28ప్రజావాణి: ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటే సహించేది లేదని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం తాను ఎల్లప్పుడూ ముందుంటానని 17వ వార్డు కౌన్సిలర్ యెరికల్ రెడ్డి స్పష్టం చేశారు. గతంలో ఇండియా సిమెంట్స్, ప్రస్తుతం అల్ట్రాటెక్ సిమెంట్స్ యాజమాన్యం స్థానిక ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చడంలో నిర్లక్ష్యం వహించడాన్ని నిరసిస్తూ, ఆయన ప్రజలతో కలిసి సోమవారం భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఫ్యాక్టరీ నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా స్థానిక మహిళలు, ప్రజలతో కలిసి ఖాళీ బిందెలతో ఫ్యాక్టరీ ఎదుట శాంతియుతంగా ధర్నా నిర్వహించారు.

గతంలో ఇండియా సిమెంట్స్ ఇచ్చిన హామీ..

గతంలో ఈ ప్రాంతంలో ఇండియా సిమెంట్ ఫ్యాక్టరీ ఉన్న సమయంలో, ఫ్యాక్టరీ నుండి వెలువడే కాలుష్యం వల్ల స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని కౌన్సిలర్ యెరికల్ రెడ్డి ఫ్యాక్టరీ యజమాని దృష్టికి తీసుకెళ్లారు. కాలుష్యం కారణంగా పరిసర ప్రాంతాల ప్రజలు అంటువ్యాధుల బారిన పడుతున్నారని, ముఖ్యంగా తాగునీరు కలుషితమై ప్రజల ఆరోగ్యం క్షీణిస్తోందని అప్పట్లో ఆయన యాజమాన్యంతో సుదీర్ఘంగా చర్చించారు.ప్రజల ఇబ్బందులను, కౌన్సిలర్ యెరికల్ రెడ్డి ఉదహరించిన సమస్యలను అర్థం చేసుకున్న అప్పటి ఇండియా సిమెంట్స్ యజమాని, స్థానిక ప్రజలకు సామాజిక బాధ్యత కింద ప్రతిరోజూ ఉదయం,సాయంత్రం వేళల్లో ఉచితంగా మినరల్ వాటర్ (రక్షిత తాగునీరు) సరఫరా చేస్తామని నాడు బహిరంగంగా హామీ ఇచ్చారు. అప్పటి నుండి ప్రజలకు తాగునీటి సరఫరా కొంతకాలం సక్రమంగానే సాగింది.

అల్ట్రాటెక్ యాజమాన్యం నిర్లక్ష్యం – ప్రజల ఆగ్రహం

ఇటీవలి కాలంలో ఈ ఫ్యాక్టరీ అల్ట్రాటెక్ సిమెంట్ యాజమాన్యం చేతుల్లోకి మారిన తర్వాత, గతంలో ఇచ్చిన హామీల అమలులో తీవ్ర నిర్లక్ష్యం చోటుచేసుకుంది. స్థానిక ప్రజలకు ఉదయం, సాయంత్రం అందాల్సిన మినరల్ వాటర్ సరఫరాను అల్ట్రాటెక్ యాజమాన్యం సక్రమంగా నిర్వహించడం లేదని, నీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వార్డు ప్రజలు కౌన్సిలర్ యెరికల్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. ఫ్యాక్టరీ కాలుష్యాన్ని భరిస్తూ, కనీసం తాగడానికి నీరు కూడా ఇవ్వకపోవడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఖాలి బిందెలతో కౌన్సిలర్ ఆధ్వర్యంలో నిరసన ప్రజల పక్షాన నిలిచేందుకు కౌన్సిలర్ యెరికల్ రెడ్డి తక్షణమే స్పందించారు. వార్డు ప్రజలను, ముఖ్యంగా మహిళలను ఏకం చేసి, అల్ట్రాటెక్ యాజమాన్య తీరుకు వ్యతిరేకంగా ఖాళీ బిందెలతో నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఫ్యాక్టరీ ప్రధాన ద్వారం వద్ద వందలాది మంది మహిళలతో కలిసి ఖాళీ బిందెలను ప్రదర్శిస్తూ పెద్ద పెట్టున నిరసన తెలిపారు. తమకు న్యాయం జరిగే వరకు, తాగునీటి సరఫరా పునరుద్ధరించే వరకు కదిలేది లేదని కౌన్సిలర్ రెడ్డి ఫ్యాక్టరీ గేటు వద్దే భీష్మించుకు కూర్చున్నారు.

దిగివచ్చిన అల్ట్రాటెక్ యాజమాన్యం – తక్షణ హామీ

కౌన్సిలర్ యెరికల్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన ఉధృతిని చూసి అల్ట్రాటెక్ సిమెంట్స్ యాజమాన్యం దిగివచ్చింది. ఫ్యాక్టరీ ఉన్నతాధికారులు స్వయంగా ధర్నా స్థలానికి చేరుకుని కౌన్సిలర్ యెరికల్ రెడ్డితో చర్చలు జరిపారు. ప్రజల ఇబ్బందులను, నిరసనలోని న్యాయాన్ని వారు అంగీకరించారు. ఇకపై ఎలాంటి అంతరాయం లేకుండా, గతంలో ఇచ్చిన హామీ ప్రకారం స్థానిక ప్రజలందరికీ ఉదయం మరియు సాయంత్రం వేళల్లో మినరల్ వాటర్‌ను సక్రమంగా, నిరంతరాయంగా అందిస్తామని అధికారుల సమక్షంలో స్పష్టమైన హామీ ఇచ్చారు. యాజమాన్యం నుండి సానుకూల హామీ రావడంతో కౌన్సిలర్ రెడ్డి నిరసనను విరమింపజేశారు.

ప్రజల కోసమే నా ప్రయాణం: కౌన్సిలర్ యెరికల్ రెడ్డిఈ సందర్భంగా 17వ వార్డు కౌన్సిలర్ యెరికల్ రెడ్డి మాట్లాడుతూ.17వ వార్డు ప్రజల సమస్యల పరిష్కారం కోసం నేను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను. పదవులు ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన నిలబడడమే నా విధి. ఫ్యాక్టరీ వల్ల లాభాలు పొందుతున్న యాజమాన్యాలు, స్థానిక ప్రజల ఆరోగ్యాన్ని, వారి అవసరాలను పట్టించుకోవాలి. అల్ట్రాటెక్ యాజమాన్యం ఇప్పుడు ఇచ్చిన హామీని సక్రమంగా అమలు చేయకుంటే రాబోయే రోజుల్లో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం” అని హెచ్చరించారు.తన పిలుపునందుకొని నిరసనలో పాల్గొన్న మహిళలకు,వార్డు పెద్దలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.