* రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ రావు
* నస్పూర్ లో ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
నస్పూర్ (మంచిర్యాల), ఆగస్టు 15,ప్రజావాణి:
భారతదేశ స్వాతంత్య్ర సాధనలో ప్రాణాలర్పించిన అమరుల త్యాగాలు ఎప్పటికీ మరువలేనివని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రోటోకాల్, ప్రజా సంబంధాలు) హర్కర వేణుగోపాల్ రావు అన్నారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం నస్పూర్ లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయం (కలెక్టరేట్) ఆవరణలో వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకలకు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డిసిపి ఎ. భాస్కర్, అదనపు కలెక్టర్లు పి. చంద్రయ్య, వి. రాములు, జిల్లా అటవీ అధికారి రాహుల్ కిషన్ జాదవ్, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ లతో కలిసి వేణుగోపాల్ హాజరయ్యారు. ముందుగా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జాతీయ గీతం, తెలంగాణ గీతాలాపనలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ప్రగతి సందేశాన్ని వివరించారు. అనంతరం వివిధ రంగాల్లో ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రదర్శన స్టాల్స్ ను పరిశీలించారు.
రూ. 100.10 కోట్ల చెక్కు అందజేత:
జిల్లాలోని 892 స్వయం సహాయక సంఘాలకు సంబంధించిన రూ. 100 కోట్ల 10 లక్షల బ్యాంకు లింకేజీ చెక్కును మంచిర్యాల జిల్లా సమాఖ్య సభ్యులకు అందజేశారు. అలాగే పి.ఎం.ఎఫ్.ఎం.ఈ. (PMFME) పథకం కింద 18 మంది లబ్ధిదారులకు రూ. 46,72,346 విలువైన చెక్కును పంపిణీ చేశారు.ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అలరించాయి. వేడుకలకు వచ్చిన ప్రజలు, ప్రముఖులు, మీడియా ప్రతినిధుల కోసం గ్యాలరీ, తాగునీరు, పారిశుద్ధ్య ఏర్పాట్లను సమర్థవంతంగా నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

