నంగునూరు, ఆగస్టు 24 (ప్రజావాణి):
విద్యార్థుల ఫీజు బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు చేపట్టిన రెండు రోజుల నిరాహార దీక్షకు సిద్దిపేట జిల్లా బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు రజనీకర్ రెడ్డి సంఘీభావం తెలిపారు. దీక్షా శిబిరాన్ని సందర్శించిన ఆయన రామచంద్రరావును కలిసి మద్దతు ప్రకటించారు.ఈ సందర్భంగా రజనీకర్ రెడ్డి మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పేరుకుపోవడంతో విద్యార్థులు, వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఫీజు బకాయిల చెల్లింపులో జాప్యం కారణంగా కళాశాలల యాజమాన్యాలు కూడా సమస్యలు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. విద్యార్థుల చదువులకు ఆటంకం కలగకుండా ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్‌లో ఉన్న ఫీజు బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చేపట్టిన నిరాహార దీక్షకు పార్టీ శ్రేణులు అండగా నిలుస్తాయని రజనీకర్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.

