బెజ్జంకి, ఆగస్టు 17 (ప్రజావాణి)
కరీంనగర్ డైరీ చైర్మన్, యాజమాన్యం ఆదేశాల మేరకు సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గుగ్గిళ్ల గ్రామానికి చెందిన కరీంనగర్ డైరీ పాల ఉత్పత్తిదారులు తమ సమస్యల పరిష్కారం కోసం సోమవారం కరీంనగర్ డైరీ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు శాంతియుతంగా ర్యాలీలో పాల్గొన్నారు.ర్యాలీ అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పాడి రైతులకు ప్రభుత్వం చెల్లించాల్సిన లీటరుకు రూ.4 పెండింగ్ ప్రోత్సాహకాన్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రతి రైతుకు 50 శాతం సబ్సిడీపై రెండు పాడి పశువులు అందించాలని కోరారు.అదేవిధంగా ధరణి రికార్డుల్లో కరీంనగర్ డైరీ పేరుతో ఉన్న భూమిని భూభారతి రికార్డుల్లో తెలంగాణ ఫెడరేషన్ పేరుపై మార్చడాన్ని వ్యతిరేకిస్తూ రైతులు నిరసన వ్యక్తం చేశారు. పాడి రైతుల సమస్యలను ప్రభుత్వం, జిల్లా అధికారులు వెంటనే పరిష్కరించి రైతు కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు.ర్యాలీ పూర్తిగా శాంతియుతంగా, విజయవంతంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల చైర్మన్లు, డైరెక్టర్లు, పాడి రైతులు పాల్గొన్నారు.

