*పదవి లేకున్నా.. ప్రజా సేవలో నందారం మార్క్!
* సొంత ఖర్చుతో కమ్యూనిటీ హాల్ నిర్మాణం!
*ఇక్రిశాట్ ఫేజ్-2 వాసుల కోరికకు తక్షణ స్పందన..
*నందారం సేవాభావాన్ని కొనియాడిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి
అమీన్పూర్, సెప్టెంబర్ 15 (ప్రజావాణి):పదవి ఉన్నా.. లేకున్నా ప్రజల మధ్య ఉంటూ వారి అవసరాలను గుర్తించి సేవ చేయడమే నిజమైన నాయకత్వానికి నిదర్శనమని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు కాలనీల అభివృద్ధికి సొంత నిధులు వెచ్చిస్తూ ప్రజాసేవలో ముందుంటున్న అమీన్పూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహా గౌడ్ సేవలను ఎమ్మెల్యే అభినందించారు.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ సర్కిల్ పరిధిలోని బీరంగూడ డివిజన్ ఇక్రిశాట్ కాలనీ ఫేజ్-2లో నందారం నరసింహా గౌడ్ తన సొంత నిధులతో నిర్మించిన నూతన కమ్యూనిటీ హాల్‌ను మంగళవారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. నందారం నరసింహా గౌడ్‌తో కలిసి ఎమ్మెల్యే పూజా కార్యక్రమాలు నిర్వహించి భవనాన్ని ప్రారంభించారు.
*అడిగిందే తడవుగా..
కాలనీవాసులు తమకు కమ్యూనిటీ హాల్ అవసరమని నందారం నరసింహా గౌడ్ దృష్టికి తీసుకురావడంతో ఆయన స్పందించారు. ప్రజల అవసరాన్ని గుర్తించి ఎవరినీ ఆశ్రయించకుండా సొంత నిధులతో కమ్యూనిటీ హాల్ నిర్మాణాన్ని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. శుభకార్యాలు, కాలనీ సమావేశాలు, పండుగలు, ఇతర సామాజిక కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు ఈ హాల్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కాలనీవాసులు పేర్కొన్నారు.
*నిజమైన నాయకత్వానికి నిదర్శనం*
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. పదవులు ఉన్నప్పుడే ప్రజాసేవ చేయాలనే భావన సరికాదన్నారు. పదవులు ఉన్నా లేకున్నా ప్రజల మధ్య ఉంటూ వారి అవసరాలకు స్పందించే వారే నిజమైన నాయకులని అన్నారు. నందారం నరసింహా గౌడ్ స్థానిక ప్రజల అవసరాన్ని గుర్తించి తన సొంత నిధులతో సువిశాలమైన కమ్యూనిటీ హాల్ నిర్మించి ఇవ్వడం అభినందనీయమన్నారు.
ఈ భవనం కాలనీవాసులకు ఎంతగానో ఉపయోగపడుతుందని, శుభకార్యాలు, సమావేశాలు, పండుగలు వంటి కార్యక్రమాలను సౌకర్యవంతంగా నిర్వహించుకోవచ్చని తెలిపారు. నియోజకవర్గ సమగ్ర అభివృద్ధిలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, సేవాభావం ఉన్న ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
*ప్రజల సంక్షేమమే లక్ష్యం*
నందారం నరసింహా గౌడ్ మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమమే తనకు ప్రధాన లక్ష్యమని అన్నారు. కాలనీవాసులు కమ్యూనిటీ హాల్ అవసరాన్ని తన దృష్టికి తీసుకువచ్చిన వెంటనే వారి కోరిక మేరకు నిర్మాణాన్ని చేపట్టి పూర్తి చేసినట్లు తెలిపారు. ప్రజలకు అవసరమైన చోట తనవంతు సహకారం అందించడం కొనసాగిస్తానని, రాబోయే రోజుల్లోనూ బీరంగూడ డివిజన్ పరిధిలోని ప్రజా సమస్యల పరిష్కారానికి అండగా ఉంటానని స్పష్టం చేశారు.
*కాలనీవాసుల హర్షం.. కృతజ్ఞతలు*
వినాయక చవితి పర్వదినం వేళ నూతన కమ్యూనిటీ హాల్ ప్రారంభం కావడంపై ఇక్రిశాట్ కాలనీ ఫేజ్-2 వాసులు హర్షం వ్యక్తం చేశారు. తమ అవసరాన్ని గుర్తించి అడిగిన వెంటనే సొంత ఖర్చుతో కమ్యూనిటీ హాల్ నిర్మించి ఇచ్చిన నందారం నరసింహా గౌడ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రారంభోత్సవానికి హాజరై కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డికి కూడా కృతజ్ఞతలు తెలిపారు.
పెద్ద సంఖ్యలో హాజరు
కార్యక్రమంలో అమీన్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, మాజీ కోఆప్షన్ సభ్యుడు యూనిస్, తలారి రాములు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నందారం రమేష్‌గౌడ్, జగదీష్, దాస్ యాదవ్, ఇంద్రేశం జ్ఞానేశ్వర్ ముదిరాజ్, ఇక్రిశాట్ కాలనీ ఫేజ్-2కు చెందిన రాజ మల్లేష్, హర్షవర్ధన్‌రెడ్డి, కనకరాజు, ఆకుల కృష్ణ, సందీప్‌రెడ్డి, దీపక్‌రెడ్డి, వెంకటేష్‌గౌడ్, ప్రమోద్, జోహార్, కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

