ప్రజావాణి న్యూస్ కథనం ప్రకారం ప్రత్యేక విలేకరి రిపోర్ట్:
లంచాల కాటేజీగా కాశి నాయన ఎమ్మార్వో ఆఫీస్: ప్రజావాణి కథనానికి కదిలిన అధికార యంత్రాంగం.. వీఆర్వోల గుట్టురట్టు!
కాశి నాయన (వైఎస్ఆర్ కడప జిల్లా):
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న‘ప్రజావాణి’ (స్పందన) కార్యక్రమానికి కాశి నాయన మండల రెవెన్యూ కార్యాలయంలో పాతర వేస్తున్నారు. బాధితుల పక్షాన నిలిచే ‘ప్రజావాణి న్యూస్’క్షేత్రస్థాయి పరిశీలనలో ఇక్కడి గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్వోలు) సాగిస్తున్న అవినీతి దందా బట్టబయలైంది. మ్యుటేషన్లు, కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు,విద్యార్థులకు అత్యంత కీలకమైన కులం (క్యాస్ట్), ఆదాయ (ఇన్కమ్) ధృవీకరణ పత్రాల జారీలో వీఆర్వోలు సాగిస్తున్న దోపిడీపై‘ప్రజావాణి న్యూస్’ ప్రత్యేక కథనం అందిస్తోంది.
డబ్బులు నొక్కినా డెస్కు దాటని ఫైళ్లు.. ప్రజావాణి న్యూస్ నిర్ఘాంతపోయే నిజాలు!
భూముల మ్యుటేషన్ల కోసం,పాస్ పుస్తకాల కోసం కార్యాలయం చుట్టూ తిరిగే పేద రైతుల బలహీనతలను వీఆర్వోలు పెట్టుబడిగా మార్చుకున్నారు.”డబ్బులు ఇస్తేనే పని.లేదంటే ఫైలు పెండింగ్”అనే అలిఖిత చట్టాన్ని ఇక్కడ అమలు చేస్తున్నారు.ఒక్కో మ్యుటేషన్ ఫైలుకు వేల రూపాయలు లంచంగా వసూలు చేస్తున్నట్లు ప్రజావాణి న్యూస్ ప్రతినిధి జరిపిన విచారణలో తేలింది. రైతులు అప్పులు తెచ్చి,ఉన్న కాస్త బంగారాన్ని తాకట్టు పెట్టి అధికారులు అడిగినంత ఇచ్చుకున్నా,నేటికీ ఆన్లైన్లో తప్పులు సరిదిద్దలేదు. లంచం తీసుకున్న తర్వాత కూడా వీఆర్వోలు ఆ ఫైళ్లను తహశీల్దార్ టేబుల్ వరకు వెళ్లకుండా తొక్కిపెడుతూ ముఖం చాటేస్తున్నారు.
విద్యార్థుల సర్టిఫికేట్లకూ రేట్ల ఫిక్సింగ్!
రైతుల సమస్యలు ఒకెత్తయితే,కాలేజీల్లో అడ్మిషన్లు, స్కాలర్షిప్ల కోసం దరఖాస్తు చేసుకునే పేద విద్యార్థుల నుంచి కూడా వీఆర్వోలు నిలువు దోపిడీకి తెరలేపారు. క్యాస్ట్,ఇన్కమ్ సర్టిఫికేట్ల ఆన్లైన్ అప్రూవల్ కోసం వందల నుంచి వేల రూపాయలు డిమాండ్ చేస్తున్నారు.డబ్బులు ఇచ్చుకోలేని పేద విద్యార్థుల అప్లికేషన్లను ఏదో ఒక సాకుతో రిజెక్ట్ చేస్తూ మానసిక ఆందోళనకు గురిచేస్తున్నారు. అడ్మిషన్ల సమయం దాటిపోతుండటంతో విద్యార్థులు,వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
రైతన్నల ఆవేదన..ఆక్రందన
“పొలం కాగితాల కోసం ఆఫీసు చుట్టూ తిరిగి చెప్పులు అరిగిపోయాయి.వీఆర్వో అడిగితే రూ. 10,000 అప్పు తెచ్చి ఇచ్చాం.డబ్బులు తీసుకుని రెండు నెలలవుతున్నా పని చేయలేదు.అడిగితే సమాధానం చెప్పకుండా దురుసుగా మాట్లాడుతున్నారు. ప్రజావాణి న్యూస్ అయినా మాకు న్యాయం జరిగేలా చూడాలి” అంటూ పలువురు బాధితులు తమ ఆవేదనను వెళ్లగక్కారు.సాగు పనులు మొదలవుతున్నా బ్యాంకు లోన్లు రాక, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
జిల్లా కలెక్టర్ తక్షణమే చర్యలు తీసుకోండి!
ఎమ్మార్వో ఆఫీసులో సాగుతున్న ఈ లంచాల భాగోతం,వీఆర్వోల ఇష్టారాజ్యంపై జిల్లా కలెక్టర్, విజిలెన్స్ అధికారులు తక్షణమే స్పందించి ప్రత్యేక విచారణ జరపాలని బాధితులు, రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.అవినీతికి పాల్పడుతూ,డబ్బులు తీసుకుని కూడా పేదలను వేధిస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని,పెండింగ్లో ఉన్న మ్యుటేషన్లు, పాస్ బుక్కులు, క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికేట్లను వెంటనే మంజూరు చేయించాలని ‘ప్రజావాణి న్యూస్’డిమాండ్ చేస్తోంది.
RELATED ARTICLES

