📄 ePaper
Friday, May 15, 2026
📄 ePaper
HomeతెలంగాణNalgondaస్వీయ గణన చేయని కుటుంబాలు ఇంటింటికి వచ్చే ఎన్యుమరేటర్లకు పూర్తి వివరాలు ఇవ్వాలి – మేయర్

స్వీయ గణన చేయని కుటుంబాలు ఇంటింటికి వచ్చే ఎన్యుమరేటర్లకు పూర్తి వివరాలు ఇవ్వాలి – మేయర్

📰 Generate e-Paper Clip

*స్వీయ గణన చేయని కుటుంబాలు ఇంటింటికి వచ్చే ఎన్యుమరేటర్లకు పూర్తి వివరాలు ఇవ్వాలి – మేయర్*

*నల్గొండ జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)*

నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న జనాభా గణన గృహ జాబితా (Census House Listing & Enumeration) కార్యక్రమానికి నగర ప్రజలు పూర్తి సహకారం అందించాలని నగర మేయర్ మరియు జిల్లా కలెక్టర్ కోరారు. కార్పొరేషన్ పరిధిలో మొత్తం 349 ఎన్యుమరేషన్ బ్లాకులు ఏర్పాటు చేయగా, వీటి కోసం 349 మంది ఎన్యుమరేటర్లు మరియు 57 మంది సూపర్వైజర్లు నియమించబడినట్లు అధికారులు తెలిపారు. జనాభా గణన కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 26 నుండి మే 10 వరకు స్వీయ గణన (Self Enumeration), మే 11 నుండి 13 వరకు ఇంటి నంబరింగ్ కార్యక్రమం పూర్తి చేయబడినట్లు తెలిపారు. ప్రస్తుతం మే 14 నుండి జూన్ 9 వరకు ఇంటింటి గృహ జాబితా ఎన్యుమరేషన్ కార్యక్రమం నిర్వహించబడుతోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గురువారం నగర మేయర్, జిల్లా కలెక్టర్ మరియు జిల్లా న్యాయమూర్తి నివాసాలలో గృహ జాబితా ఎన్యుమరేషన్ ప్రక్రియను కమిషనర్ ఆధ్వర్యంలో అసిస్టెంట్ సిటీ ప్లానర్ శ్రీమతి కృష్ణవేణి, టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఆఫీసర్ రెహమాన్, సంబంధిత ఎన్యుమరేటర్లు మరియు సూపర్వైజర్లు నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, నగర ప్రజలు జనాభా గణన ప్రక్రియకు సహకరించి ఇంటింటికి వచ్చే ఎన్యుమరేటర్లకు సరైన వివరాలు అందించాలని కోరారు. స్వీయ గణన పూర్తి చేసిన కుటుంబాలకు “H” అక్షరంతో ప్రారంభమయ్యే 11 అంకెల గుర్తింపు సంఖ్య (Reference Number) లభిస్తుందని, ఆ సంఖ్యను తప్పనిసరిగా ఎన్యుమరేటర్ల కు అందించాలని తెలిపారు. అలాగే స్వీయ గణన సమయంలో ఏవైనా తప్పులు నమోదు అయినట్లయితే, ప్రస్తుతం జరుగుతున్న ఇంటింటి ఎన్యుమరేషన్ సమయంలో వాటిని సరిచేసుకునే అవకాశం ఉందని తెలిపారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, స్వీయ గణన చేయని కుటుంబాలు ఇంటింటికి వచ్చే ఎన్యుమరేటర్లకు పూర్తి వివరాలు అందించాలని సూచించారు. ఎన్యుమరేటర్లు మరియు సూపర్వైజర్లు ప్రతి ఇంటిని సందర్శించి వివరాలను నమోదు చేసి ఎన్యుమరేషన్ ప్రక్రియను పూర్తి చేస్తారని తెలిపారు. ప్రజలు ఎలాంటి అపోహలు లేకుండా అధికారులకు సహకరించాలని కోరారు. జనాభా గణన ఆధారంగా భవిష్యత్ ప్రభుత్వ సంక్షేమ, మౌలిక వసతులు మరియు అభివృద్ధి కార్యక్రమాల ప్రణాళికలు రూపొందించబడతాయని అధికారులు తెలిపారు. అందువల్ల ప్రతి కుటుంబం ఖచ్చితమైన సమాచారాన్ని అందించి జనాభా గణన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular