కాశినాయన(ఆగస్టు 4 ప్రజావాణి ) మండలంలో ఇసుక, మట్టి మాఫియా యథేచ్ఛగా రెచ్చిపోతోంది. సగిలేరు డ్యామ్‌కు సంబంధించిన వాగు పరివాహక ప్రాంతంలో, వివేకానంద ఆశ్రమం వెనుక భాగంలో జరుగుతున్న అక్రమ మట్టి త్రవ్వకాలు ఇప్పుడు స్థానికంగా తీవ్ర సంచలనంగా మారాయి. ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ, పగలు రేయి తేడా లేకుండా యంత్రాలతో మట్టిని తరలిస్తుండటంతో ప్రకృతి సంపద పూర్తిగా ధ్వంసమవుతోంది, డీకేటీ భూముల్లో తవ్వకాలు.
పర్మిషన్ ఎక్కడ ?
అక్రమ త్రవ్వకాలు జరుగుతున్న సదరు భూమి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ‘డీకేటీ’ (ధారఖాస్తు ఖరారు పట్టీ) భూమి కావడం ఇక్కడ గమనార్హం. నిరుపేదల సాగు కోసం లేదా ప్రభుత్వ అవసరాల కోసం కేటాయించే ఇలాంటి భూముల్లో వాణిజ్య పరమైన త్రవ్వకాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతులు ఉండవు. మరి అలాంటిది, ఈ నిషిద్ధ ప్రాంతంలో యథేచ్ఛగా జేసీబీలు పెట్టి మట్టిని ఎలా తోడుతున్నారనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. దీనికి సంబంధించి మైనింగ్ లేదా రెవెన్యూ అధికారులు ఏ ప్రాతిపదికన అనుమతులు ఇచ్చారో సమాధానం చెప్పాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.ముడుపుల పర్వం.. అధికారుల మూగనోము!
ఈ అక్రమ వ్యవహారం వెనుక పెద్ద ఎత్తున రాజకీయ నాయకుల హస్తం, అధికారుల కుమ్మక్కు ఉందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అసలు అనుమతులే లేని చోట ఇంత బహిరంగంగా త్రవ్వకాలు జరుగుతున్నా, స్థానిక యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వెనుక అసలు రహస్యం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఈ అక్రమ రవాణాను కప్పిపుచ్చడానికి మరియు అధికారులను మచ్చిక చేసుకోవడానికి లక్షల రూపాయల ‘ముడుపులు’ చేతులు మారాయనే అపోహలు, విమర్శలు ప్రజల్లో జోరుగా సాగుతున్నాయి. ప్రమాదకరంగా మారిన గుంతలు. మూగజీవాలకు మృత్యుపాశాలు
నిబంధనలకు విరుద్ధంగా వాగు గర్భాన్ని నచ్చినట్లు తవ్వేస్తుండటంతో అక్కడ భారీ గోతులు ఏర్పడ్డాయి. చాలా లోతుగా, ప్రమాదకరంగా ఈ త్రవ్వకాలు జరపడం వల్ల పర్యావరణానికి తీవ్ర విఘాతం కలుగుతోంది.ఆశ్రమ పరిసర ప్రాంతాల్లో తిరిగే ఆవులు,గేదెలు వంటి మూగ జీవాలు ప్రమాదవశాత్తూ ఆ వాగులోకి వెళ్తే,తిరిగి బయటకు రాలేని భయానక పరిస్థితి నెలకొంది. ఇప్పటికే కొన్ని పశువులు ఆ లోతైన గుంతల్లో చిక్కుకుపోయే ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నాయని కాపరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేపో మాపో భారీ వర్షాలు పడితే ఈ గుంతలు నీటితో నిండి,అటు పశువులకే కాక అటుగా వెళ్లే మనుషులకు కూడా ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది. తక్షణమే స్పందించాలి వివేకానంద ఆశ్రమం వెనుక భాగంలో,సగిలేరు వాగు పరిధిలో జరుగుతున్న ఈ దోపిడీని తక్షణమే అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉన్నతాధికారులు స్పందించి ఈ అక్రమ త్రవ్వకాలపై సమగ్ర విచారణ జరపాలని, అసలు పర్మిషన్లు ఉన్నాయో లేదో తేల్చాలని, బాధ్యులైన మైనింగ్, రెవెన్యూ అధికారులపై మరియు మట్టి మాఫియాపై చర్యలు తీసుకోవాలని కాశినాయన మండల ప్రజలు ద్వారా డిమాండ్ చేస్తున్నారు.




