ఘట్‌కేసర్, ఏప్రిల్ 19 (ప్రజావాణి): ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో 262వ వారపు నిత్య పూలమాల కార్యక్రమం ఘట్‌కేసర్ పరిధిలో ఘనంగా నిర్వహించబడింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రంగారెడ్డి జిల్లా కోర్టు న్యాయవాది గ్యారా గోవర్ధన్ హాజరై డా. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గ్యారా గోవర్ధన్ మాట్లాడుతూ భారత రాజ్యాంగంపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని, అందుకే 20 రాజ్యాంగ పుస్తకాలను ప్రజలకు పంపిణీ చేసినట్లు తెలిపారు. స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం వంటి విలువలను స్థాపించడానికి అంబేద్కర్ గారు చేసిన కృషి అపారమని కొనియాడారు. ఆయన ఒక వర్గానికి మాత్రమే కాకుండా దేశంలోని అన్ని వర్గాల అభ్యున్నతిని దృష్టిలో ఉంచుకుని పనిచేసిన మహానుభావుడని పేర్కొన్నారు. అంబేద్కర్ గారి ఆలోచనలను ప్రజల్లో విస్తరించేందుకు జరిగే ప్రతి కార్యక్రమానికి తమ సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. అలాగే మహాత్మా బసవేశ్వర 892వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో మేకల దాస్, కే. నర్సింగ్ రావు, బండారి రాందాస్, కే. సత్యం, ఎరిటం శ్రీనివాస్, కడుపోళ్ల బిక్షపతి, మీసాల రాజేష్ కుమార్, గంగారాం అంజయ్య, సి ఆనంద్, సి నిఖిల్, ఇ విష్ణు, జె అఖిల్, కె దినేష్ కుమార్, రవి కుమార్, యు శివ ప్రసాద్, ఆర్ కె నాయుడు, లలిత్, బాలానగర్ గణేష్ గౌడ్, కృష్ణం రాజు తదితరులు పాల్గొన్నారు.



