📄 ePaper
Sunday, July 26, 2026
📄 ePaper
HomeతెలంగాణBhadradri Kothagudemప్రభుత్వాలు మారినప్పుడల్లా డిజైన్లు మారుస్తారా

ప్రభుత్వాలు మారినప్పుడల్లా డిజైన్లు మారుస్తారా

📰 Generate e-Paper Clip

ప్రభుత్వాలు మారినప్పుడల్లా డిజైన్లు మారుస్తారా…?

* ”సీతారామ” లింకు కాలువలు మాకొద్దు ..!
* రుద్రంకోట ‘బొల్లిగట్టు’ రిజర్వాయర్ సాధనే మా లక్ష్యం…
* పట్వారిగూడెం ఉమ్మడి పంచాయతీ పరిధిలోని ఐదు గ్రామాల ప్రజల గర్జన..
* స్పందించకుంటే తీవ్ర ఆందోళనలకు సిద్ధం:
* ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రులు తక్షణమే స్పందించాలి..!

దమ్మపేట,ప్రజావాణి న్యూస్, జూలై 25:
మండల పరిధిలోని పట్వారిగూడెం ఉమ్మడి గ్రామ పంచాయతీ పరిధిలో గల జగ్గారం, బాలరాజుగూడెం, పార్కలగండి, అంకంపాలెం, ఆర్లపెంట గ్రామాల ప్రజలు సీతారామ ప్రాజెక్టు మెయిన్ కెనాల్ నుండి ప్రతిపాదించిన లింకు కాలువలపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆయా గ్రామాల పరిధిలో నిర్మించ తలపెట్టిన లింకు కాలువలు తమకు వద్దంటూ స్థానిక ప్రజలు, రైతులు ఏకగ్రీవంగా తీర్మానించారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ప్రాజెక్టుల డిజైన్లు మారుస్తూ తమ ప్రాంత ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదాస్పద ప్రతిపాదనను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు.నాడు ‘ఇందిరా సాగర్’.. నేడు ‘డిజైన్ల’ మార్పు!గత 2004 కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాంత సాగునీటి అవసరాల కోసం ‘ఇందిరా సాగర్’ ప్రాజెక్టును ప్రతిపాదించారు. శబరి-గోదావరి సంగమ క్షేత్రమైన రుద్రంకోట నుండి అంకంపాలెం పరిధిలోని ఆర్లపెంట గ్రామ పంచాయతీ పరిధి గల ‘బొల్లిగట్టు’ వద్ద భారీ రిజర్వాయర్ ఏర్పాటు చేయడానికి అప్పటి ప్రభుత్వం రూ. 2,000 కోట్ల నిధులను కేటాయించి పనులు కూడా ప్రారంభించింది. జీవనది సంగమం కావడం వల్ల ఏడాది పొడవునా నీటి లభ్యత ఉంటుందని, తమ ప్రాంతానికి నీటి ఎద్దడి రాదనే ఉద్దేశంతో నాడు ఉమ్మడి పంచాయతీ పరిధిలోని ప్రజలందరూ కాలువల నిర్మాణానికి అనుకూలంగా తీర్మానాలు ఇచ్చారు.అయితే, 2014 తర్వాత మారిన ప్రభుత్వం పాత డిజైన్‌ను పక్కనబెట్టి, అదే కాలువను దుమ్ముగూడెం నుండి కమలాపురం రిజర్వాయర్‌కు తరలించేలా రూపాంతరం మార్చింది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ప్రాజెక్టు రీ-డిజైన్ల పేరుతో తమను ఇబ్బందులకు గురిచేస్తుంటే.. నాడు కాలువలు కావాలని ఇచ్చిన తామే, నేడు మారిన పరిస్థితుల దృష్ట్యా ‘వద్దు’ అని తీర్మానాలు ఇవ్వడం చట్టబద్ధంగా సబబేనని స్థానిక రైతులు స్పష్టం చేస్తున్నారు. తమ ప్రాంతానికి ఉపయోగపడని ఈ లింకు కాలువల ప్రతిపాదనలను పూర్తిగా తిరస్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.

*ఉమ్మడి జిల్లా మంత్రులు స్పందించాలి..*

ప్రాజెక్టు రీ-డిజైన్ల వల్ల స్థానిక గ్రామాల ప్రజలకు, రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, ఈ వ్యవహారంపై ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రులు తక్షణమే స్పందించాలని బాధితులు కోరుతున్నారు. పాత ప్రతిపాదనల ప్రకారం బొల్లిగట్టు రిజర్వాయర్ నిర్మాణాన్ని పరిగణనలోకి తీసుకోవాలని, ప్రస్తుతం ప్రతిపాదించిన లింకు కాలువలను తక్షణమే రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా స్పందించి ఈ లింకు కాలువల ప్రతిపాదనలను ఉపసంహరించుకోకపోతే, ప్రాజెక్టు పనులను అడ్డుకోవడంతో పాటు ఐదు గ్రామాల ప్రజలను ఏకం చేసి తీవ్రస్థాయిలో ప్రత్యక్ష ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular