📄 ePaper
Saturday, June 6, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా తొలి విడత వార్డు సభలు

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా తొలి విడత వార్డు సభలు

📰 Generate e-Paper Clip

*ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా తొలి విడత వార్డు సభలు*

*12 డివిజన్లలో ప్రత్యేక వార్డు సభలు – ప్రజలు భాగస్వాములు కావాలి : మున్సిపల్ కమిషనర్ బి. శరత్ చంద్ర*

*నల్గొండ జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)*

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంలో భాగంగా గురువారం (04.06.2026) నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో తొలి విడతగా 12 డివిజన్లలో ప్రత్యేక వార్డు సభలు నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ బి. శరత్ చంద్ర తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ డివిజన్ నెం. 01, 02, 03 లలో నిర్వహించిన వార్డు సభలకు హాజరై ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నగరంలోని 48 డివిజన్లలో నాలుగు విడతలుగా వార్డు సభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా 04.06.2026న 12 డివిజన్లు, 06.06.2026న 12 డివిజన్లు, 08.06.2026న 12 డివిజన్లు, 10.06.2026న 12 డివిజన్లలో ప్రత్యేక వార్డు సభలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వార్డు సభల ప్రధాన ఉద్దేశ్యం ప్రజలకు ప్రభుత్వ కార్యక్రమాలపై అవగాహన కల్పించడం, స్థానిక సమస్యలను గుర్తించడం, ప్రజల సూచనలు స్వీకరించడం, పౌర సేవలను మరింత మెరుగుపరచడమేనని కమిషనర్ తెలిపారు. ఈ సందర్భంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ రూల్స్–2026 గురించి ప్రజలకు విస్తృత అవగాహన కల్పించారు. ప్రతి ఇంటి వద్ద చెత్తను తడి చెత్త, పొడి చెత్త, శానిటరీ చెత్త మరియు ప్రత్యేక సంరక్షణ చెత్త గా నాలుగు రకాలుగా వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి అందించాలని సూచించారు. చెత్తను మూలం వద్దనే వేరు చేయడం ద్వారా పరిశుభ్రమైన నగర నిర్మాణంతో పాటు వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణ సాధ్యమవుతుందని వివరించారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని డ్రైనేజీలలో చెత్త వేయకూడదని, నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, దోమల నివారణ చర్యలకు సహకరించాలని ప్రజలకు సూచించారు. అలాగే తాగునీటిని మరిగించి తాగడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ద్వారా సీజనల్ వ్యాధులను నివారించవచ్చని తెలిపారు. వార్డు సభలలో ప్రజల నుండి తాగునీటి సరఫరా, పారిశుధ్యం, డ్రైనేజీలు, వీధి దీపాలు, రహదారులు, వర్షపు నీటి సంరక్షణ, మొక్కల పెంపకం తదితర అంశాలపై వినతులు, సూచనలు స్వీకరించి సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. నగర ప్రజలందరూ తమ డివిజన్లలో నిర్వహించే వార్డు సభలకు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ప్రభుత్వం అందిస్తున్న అవగాహన సందేశాలను ఇంటింటికీ చేరవేయడంలో భాగస్వాములు కావాలని కమిషనర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంబంధిత డివిజన్ల కార్పొరేటర్లు, వార్డు అధికారులు, మున్సిపల్ సిబ్బంది, శానిటరీ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular